మొన్న మహేష్.. నిన్న విజయ్.. ఇప్పుడు రజనీ

మొన్న మహేష్.. నిన్న విజయ్.. ఇప్పుడు రజనీ

దర్శకుడిగా విజయ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అజిత్ లాంటి పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసిన వ్యక్తి ఎస్.జె.సూర్య. అతను తీసింది తక్కువ సినిమాలే అయినా.. చాలా వరకు క్రేజీ ప్రాజెక్టులే. ఐతే దర్శకుడిగా ఎంత వేగంగా పేరు అంతే వేగంగా పేరు పోగొట్టుకున్నాడు. ‘కొమరం పులి’ సహా చెత్త సినిమాలు చేసి పక్కకు తప్పుకున్నాడు. కానీ దర్శకుడిగా జోరు తగ్గిపోతున్న సమయంలో నటుడిగా అతడికి బ్రేక్ వచ్చింది.

తనకే సొంతమైన ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్‌తో నటుడిగా బలమైన ముద్ర వేశాడు సూర్య. ఇప్పుడు దక్షిణాదిన అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో అతనొకడు కావడం విశేషం. తాను డైరెక్ట్ చేసిన మహేష్, విజయ్‌లకు అతను విలన్‌గా నటించడం విశేషం. మహేష్‌తో ‘స్పైడర్’లో, విజయ్‌తో ‘మెర్శల్’లో అతను నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు సూర్య చేతిలో మరింత క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌కే అతను విలన్‌గా నటించబోతున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో రజనీ చేయబోయే కొత్త సినిమాకు సూర్యనే ప్రతినాయకుడిగా ఖరారయ్యాడు. మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాడు సూర్య. తమిళంలో అమితాబ్ నటిస్తున్న తొలి చిత్రమిదే. బిగ్-బితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు.

మరోవైపు అజిత్ చేయబోయే కొత్త సినిమాకు కూడా సూర్యను విలన్‌‌గా అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలా దర్శకత్వం నుంచి నటనలోకి వచ్చిన వ్యక్తి ఇంత క్రేజ్ సంపాదించుకుని, భారీ ప్రాజెక్టుల్లో నటిస్తుండటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అతడిని చూసి రెగ్యులర్ ఆర్టిస్టులు అసూయ చెందే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దెబ్బతో దర్శకత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి నటనకే అంకితం అయిపోయినట్లున్నాడు సూర్య.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English