తేజు నోట ఆరు ఫ్లాపుల మాట

తేజు నోట ఆరు ఫ్లాపుల మాట

సినిమా వాళ్లు చాలామందిలో ఒక అహం ఉంటుంది. తమ ఫెయిల్యూర్ల గురించి ప్రస్తావించడానికి ఇష్టపడరు. వాటిని అంగీకరించరు. ఎప్పుడైనా తప్పక వాటి గురించి ప్రస్తావించాల్సి వచ్చినా ఇబ్బంది పడతారు. కానీ అపజయాల్ని అంగీకరిస్తే, వాటి గురించి ఓపెన్‌గా మాట్లాడితే జనాలకు నచ్చుతుందని, వాళ్ల మనసు గెలవొచ్చని చాలామందికి తెలియదు.

ఐతే సాయిధరమ్ తేజ్ మాత్రం ఈ విషయాన్ని బాగానే గ్రహించినట్లున్నాడు. కెరీర్ ఆరంభంలో మూడు వరుస హిట్లతో మాంచి ఊపు మీద కనిపించిన తేజు.. ఆ తర్వాత ట్రాక్ తప్పి ఏకంగా అరడజను ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. గత ఏడాది ‘తేజ్ ఐ లవ్యూ’తో ఫ్లాప్లుల్లో అతడి డబుల్ హ్యాట్రిక్ పూర్తయింది. ఐతే ఆ సినిమా ఫెయిలైన కొంత కాలానికే ప్రేక్షకుల్ని, మెగా అభిమానుల్ని నిరాశ పరిచినందుకు మన్నించమని కోరుతూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా తన కొత్త సినిమా ‘చిత్రలహరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనూ తేజు తన ఫెయిల్యూర్ల గురించి నిజాయితీగా మాట్లాడి ఆకట్టుకున్నాడు. ఒకసారి కాదు.. రెండు మూడుసార్లు అతను తాను ఫ్లాపుల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు. ప్రసంగం మొదలైన కాసేపటికే తన ఫ్లాపుల లెక్క కూడా చెప్పాడు తేజు. ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న తనను నమ్మి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ‘చిత్రలహరి’ సినిమాను నిర్మించినందుకు తాను కృతజ్ఞుడనై ఉంటానని తేజు చెప్పాడు.

అలాగే అభిమానుల గురించి చెబుతూ.. తాను హిట్లలో ఉన్నపుడు ఆడిటోరియాల్లో ఎంత మంది జనాలున్నారో.. ఇన్ని ఫ్లాపుల తర్వాత ఎంత మంది జనాలు ఉన్నారో స్పష్టంగా తెలుస్తోందని.. ఇప్పటికీ తనను అభిమానిస్తూ తన వెంట ఉన్నవాళ్లే నిజమైన అభిమానులుగా భావిస్తానని.. వీళ్ల ప్రేమ తనకు చాలని తేజు అన్నాడు. అంచనాలు అందుకోవడానికి తాను మరింతగా కష్టపడి పని చేస్తానని అభిమానులకు తేజు హామీ ఇచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English