సునీల్ దర్శకత్వం.. తేజు హీరో

సునీల్ దర్శకత్వం.. తేజు హీరో

కమెడియన్ సునీల్ ఇండస్ట్రీకి వచ్చింది నటుడు అవుదామని కాదు. దర్శకుడిగా మారాలని. నటుడు కావడాని కంటే ముందు అతను దర్శకత్వ శాఖలో పని చేశాడు కూడా. కమెడియన్‌గా ఫుల్ బిజీ అయిపోవడంతో దర్శకత్వ కలను మధ్యలో వదిలేశాడు. మళ్లీ దాని ఊసే ఎప్పుడూ ఎత్తలేదు. ఐతే తాను ఎప్పటికైనా దర్శకుడిగా మారితే మాత్రం సాయిధరమ్ తేజే హీరో అని సునీల్ చెప్పడం విశేషం.

ఈ మాట ఇప్పుడు కాదని.. తేజు హీరో కాకముందే తాను చెప్పానని ‘చిత్రలహరి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో సునీల్ చెప్పాడు. తేజు సినిమాల్లోకి రాకముందే తనకు బాగా పరిచయం అని.. అప్పటికి తనకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉండటంతో ఎప్పటికైనా తేజు సినిమాల్లోకి వస్తే అతడిని హీరోగా పెట్టి సినిమా తీయాలని ఉండేదని.. ఒక సందర్భంలో ‘నిన్ను హీరోగా పెట్టి బీభత్సమైన సినిమా తీస్తానబ్బాయ్’ అంటూ తేజుకు స్వయంగా చెప్పానని సునీల్ వెల్లడించాడు.

ఇక ఈ చిత్రంలో తన మీద.. తేజు మీద తీసిన గ్లాస్ మేట్స్ పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సునీల్. తాను చదువుకునే రోజుల్లో సాయంత్రాల్లో తరచుగా పార్టీలు పెట్టుకుని ఫ్రెండ్స్ అందరం గ్లాస్ మేట్స్‌గా మారిపోయేవాళ్లమని అతనన్నాడు. మందుకొట్టేవాళ్లు ప్రతి ఒక్కరూ లోన డ్యాన్స్ చేస్తూ ఉంటారని.. ఆ విషయం వాళ్లను చూసేవాళ్లకు తెలియదని చెప్పిన సునీల్.. మామూలు వ్యక్తులు ఎలా డ్యాన్స్ చేస్తారో, మందుకొట్టిన వాళ్లు వాళ్లకు వాళ్లుగా ఎలా లోన డ్యాన్స్ చేసేస్తుంటారో స్టేజ్ మీద చేసి చూపించాడు.

ఈ రకంగా తాను పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ గ్లాస్ మేట్స్ పాటకు డ్యాన్స్ చేసినట్లు సునీల్ చెప్పాడు. దేవిశ్రీ ప్రసాద్ పాటకు డ్యాన్స్ చేయాలన్నది తనకు ఎప్పట్నుంచో ఉన్న కోరిక అని.. అది గ్లాస్ మేట్స్ పాటతో తీరిందని సునీల్ అన్నాడు. ఈ సినిమాలో తనది చాలా మంచి పాత్ర అని.. చాలా కాలం తర్వాత జెన్యూన్ కామెడీ ఉన్న క్యారెక్టర్ చేశానని సునీల్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English