బతికే అవకాశాలు 30 శాతమే అన్నారు

బతికే అవకాశాలు 30 శాతమే అన్నారు

తాము అభిమానించే తారకు క్యాన్సర్ అంటే ఫ్యాన్స్ తల్లడిల్లిపోతారు. ఎంతటి వారినైనా కుంగదీసే జబ్బుల్లో ఇదొకటి. ట్రీట్మెంట్ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ.. క్యాన్సర్ అంటే ఇప్పటికీ కంగారు పడిపోతారు. జీవితం మీద ఆశలు వదులుకుంటారు. సోనాలి బింద్రేకు క్యాన్సర్ అన్న వార్త వినగానే ఆమెను అభిమానించే కోట్ల మంది వేదనకు గురయ్యారు. సోనాలి సైతం ఈ విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు లోనైందట.

తాను బతికే అవకాశం 30 శాతం మాత్రమే అని వైద్యులు అన్నపుడు తన గుండె పగిలిందని.. కానీ తాను చచ్చిపోతానని మాత్రం ఏ రోజూ అనుకోలేదని.. బతుకుపై నమ్మకం సడిపోలేదని ఆమె చెప్పింది. ఏడాదికి పైగా చికిత్స అనంతరం సోనాలి కోలుకుని మళ్లీ మామూలు మనిషిగా మారే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాన్సర్ బయటపడ్డపుడు తన మానసిక స్థితి ఎలా ఉందో ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించింది.

‘‘నా ఉదర భాగంలో క్యాన్సర్‌ కణాలు పూర్తిగా వ్యాపించి ఉన్నాయని స్కాన్‌ ద్వారా తెలిసింది. బతికే అవకాశం కేవలం 30 శాతం ఉందని న్యూయార్క్‌ వైద్యులు చెప్పినప్పుడు.. నా గుండె పగిలింది. కానీ ఏ దశలోనూ చనిపోతాననే ఆలోచన నాకు రాలేదు. పూర్తిగా కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందని మాత్రం అర్థమైంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు నా బలం అయ్యారు. వారి వల్లే నేను ధైర్యంగా నిలబడగలిగాను. క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళలకు నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా.. ఈ సమయంలో మీకు ఎక్కువ జాగ్రత్త, మద్దతు అవసరం. మీ చుట్టూ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉండేలా చూసుకోండి. ఇది ప్రేమ, అనురాగం పొందాల్సిన సమయం. ఇప్పుడు నేను బాగానే కోలుకున్నా. నా శరీరంపై ఎక్కువ దృష్టిపెడుతున్నా. చిన్నచిన్న మార్పుల్ని సైతం గమనిస్తున్నా. ఇది నాకో కొత్త ప్రయాణం, కొత్త జీవితం’’ అంటూ సోనాలి ఉద్వేగంగా చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English