వెయ్యి కోట్ల సినిమా రద్దయింది

వెయ్యి కోట్ల సినిమా రద్దయింది

మహాభారత కథను భీముడి కోణంలో చెప్పే ‘రందమూలం’ అనే నవల ఆధారంగా రూ.1000 కోట్ల ఖర్చుతో మలయాళంలో ఓ సినిమా రాబోతున్నట్లు కొన్నేళ్ల కిందట ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళ దర్శకుడు శ్రీ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశాడు. యూఏఈకి చెందిన వ్యాపార వేత్త బీఆర్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమా గురించి అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఈ సినిమా మాటలకే పరిమితం అయింది.

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా జరగకుండా ఆగిపోయింది. ఈ సినిమా ముందుకు కదలకపోవచ్చని కొన్ని నెలల కిందటే వార్తలొచ్చాయి. ఇప్పుడు స్వయంగా నిర్మాతే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తాజాగా ఒక ఇంగ్లిష్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చిన బీఆర్ శెట్టి ఈ సినిమా రద్దయిందని చెప్పాడు.

దర్శకుడు శ్రీకుమార్‌కు, రచయిత వాసుదేవ్ మీనన్‌కు విభేదాలు రావడంతోనే ఈ సినిమా ఆపేయాల్సి వచ్చినట్లు బీఆర్ శెట్టి తెలిపాడు. వాసుదేవ్ రాసిన ‘రండమూలం’ అనే నవల ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఆ నవల ఆధారంగా వాసుదేవ్ స్క్రీన్ ప్లే కూడా రాశాడు. కానీ అతను చిత్ర బృందానికి స్క్రిప్టు అందించిన నాలుగేళ్లకు కూడా సినిమా మొదలు కాలేదు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. తాను ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేయడానికి సిద్ధపడ్డ ఆయన.. తన స్క్రిప్టు కూడా వెనక్కి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేశాడు.

చిత్ర బృందానికి నాలుగేళ్ల ముందు తాను స్క్రిప్టు ఇచ్చి.. మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నానని.. ఐతే మూడేళ్ల తర్వాత ఒక ఏడాది ఒప్పందాన్ని పొడిగించానని.. ఐతే ఇప్పటికీ ఈ సినిమా మొదలే కాలేదని.. ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదని కొన్ని నెలల కిందట వాసుదేవ్ విమర్శించాడు. మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ సినిమా అయితే పట్టాలెక్కట్లేదని నిర్మాత స్పష్టం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English