చిరుకి మరో ఛాయిస్ లేదు పాపం

చిరుకి  మరో ఛాయిస్ లేదు పాపం

పదేళ్లు వెనక్కి వెళ్లండి. ఇదే సమయానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఎంత కీలకంగా ఉన్నాడో తెలిసిందే. ఆ ఎన్నికల్లో తన ప్రజారాజ్యం పార్టీ కోసం చిరు ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించాడు. ఐదేళ్ల కిందటి ఎన్నికల్లో సైతం చిరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. కానీ ఈ ఎన్నికలు వచ్చే సమయానికి చిరు ఉనికే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోవడంతో చిరు ఉనికి ప్రశ్నార్థకం అయింది.
 
రాజ్యసభ సభ్యత్వం పూర్తి కాగానే చిరు అడ్రస్ లేకుండా పోయాడు. మధ్యలో చిరు తమ్ముడు పవన్ పార్టీ పెట్టి చిరు అసలు రాజకీయాల గురించి మాట్లాడే అవకాశమే లేకుండా చేశాడు. రాజకీయాల్లో ఇప్పుడు చిరు గురించి చర్చే లేదు. ఇప్పుడసలు చిరు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడు అన్నది కూడా పట్టించుకునేవారు లేరు.

ప్రస్తుతం ఓవైపు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. చిరు మరో తమ్ముడు నాగబాబు కూడా ఎన్నికల బరిలో ఉన్నాడు. కానీ చిరు మాత్రం అడ్రస్ లేడు. తమ్ముళ్ల తరఫున ప్రచారం చేయలేడు. కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వలేని దుస్థిితి ఆయనది. హైదరాబాద్‌లోనే ఉండి బయటికి వస్తే మీడియా వాళ్లు ఎన్నికలు, రాజకీయాల గురించి అడిగినా అడుగుతారు. అందుకే చిరు ఈ టైంలో తన భార్య సురేఖతో కలిసి ఫారిన్ టూర్ వెళ్లిపోయారు.

ప్రస్తుతం చిరు జపాన్‌లో పర్యటిస్తుండటం విశేషం. ఆయన వెంట వేరే కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా లేరు. భార్యతో కలిసి విహరిస్తున్నారాయన. ఇక్కడ ఎన్నికల వేడి ఇలా ఉన్న సమయంలో.. తమ్ముళ్లిద్దరూ రాజకీయ కదన రంగంలో పోరాడుతున్న వేళ.. చిరు ఇలా విదేశీ పర్యటన చేయడం ఆశ్చర్యమే. కానీ ఆయనకు మరో ఛాయిస్ లేదు పాపం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగల సత్తా ఉందని భావించిన వ్యక్తి ఈ స్థితికి వస్తాడని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English