కేసీఆర్ కుటుంబ చానల్ కు సీఈవో ఆంధ్రా వ్యక్తి!



తెలంగాణ రాష్ట్ర సాధన వేళ.. ప్రతి విషయంలోనూ లెక్కలు చెప్పి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరం ఏమిటో చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతటి ప్రభావాన్ని చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన రంగాల్ని పక్కన పెడితే.. ప్రైవేటు రంగంలో.. అది కూడా మీడియాలోనూ.. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో మీడియా సంస్థలో పని చేసే పాత్రికేయులు.. వారికి అధిపతులుగా ఉన్న వారి ప్రాంతీయ మూలాల్ని లెక్కలు వేసి మరీ చర్చకు పెట్టేవారు. హైదరాబాద్ లో పని చేసే పాత్రికేయుల్లో ఏపీకి చెందిన వారే అయినప్పటికీ.. దశాబ్దాల తరబడి హైదరాబాద్ లో స్థిరపడి పోయినప్పటికీ వారిని ఏపీ వారిగానే చూసే ధోరణి అప్పట్లో ఉండేది.

మీడియా ప్రస్తావన ఎందుకంటే.. మిగిలిన రంగాలకు భిన్నంగా ఉండే మీడియాలో పని చేసే పాత్రికేయులు విశాల భావాలు.. సార్వజనీతను ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అలాంటి రంగంలోనూ చీలిక తేవటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అలాంటి కేసీఆర్ కుటుంబానికి చెందిన ‘టీ న్యూస్’ చానల్ కు కొత్త సీఈవో ఎంపిక చేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు షాకింగ్ గా మారింది.

నూటికి నూరు శాతం తెలంగాణ వాదాన్ని వినిపిస్తూ.. ఆంధ్రా వ్యతిరేకతో ప్రారంభమైన టీ న్యూస్ చానల్ కు ఆంధ్రా ప్రాంతానికి చెందిన సీఈవో ఎంపిక కావటానికి మించిన సంచలనం ఇంకేం ఉంటుంది? ఇప్పటివరకు ఎన్టీవీ గ్రూపులో ఉన్న వీఎస్ఆర్ శాస్త్రి అలియాస్ వి. సుందర రామ శాస్త్రిని టీ న్యూస్ కొత్త సీఈవోగా ఎంపిక చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కోసం తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేందుకు ఏర్పాటు చేసిన చానల్ లో ఏపీ ప్రాంతానికి చెందిన వ్యక్తి (హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయి చాలా కాలమే అయ్యిందనుకోండి)కి అత్యున్నత పగ్గాలు అప్పగించటం గమనార్హం.

అయితే.. ఈ ఎంపిక వెనుక కీలకభూమిక పోషించింది ఈ మధ్యనే నమస్తే తెలంగాణ పత్రికకు ఎడిటర్ గా ఎంపికైన తిగుళ్ల క్రిష్ణమూర్తిగా చెబుతున్నారు. ఆంధ్రజ్యోతి నుంచి నమస్తేకు వచ్చిన ఆయన తెలంగాణ ప్రాంతానికే చెందిన వ్యక్తే అయినప్పటికి శాస్త్రి గారి సామాజిక వర్గానికి చెందిన తిగుళ్ల.. టీ న్యూస్ చానల్ కు సీఈవోగా ఎంపిక చేయటంలో కీలకభూమిక పోషించినట్లు తెలుస్తోంది. ఈ మార్పు అనూహ్యమే కాదు.. ఆసక్తికరం కూడా. ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి వీలుగా యాజమాన్యాన్ని ఒప్పించటం మాటలుకాదు. ఆ విషయంలో తిగుళ్ల సక్సెస్ అయ్యారని చెప్పాలి.

ఇక.. టీన్యూస్ లో ఇన్ పుట్ ఎడిటర్ గా పని చేస్తున్న పీవీ శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఆయన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఇక.. శాస్త్రి ఎంపికకు మూల కారణం.. తిగుళ్ల.. శాస్త్రి వారి పూర్వరంగం ఈనాడు కావటమే. శాస్త్రి గారి శిష్యుడిగా తిగుళ్లను చెబుతారు. మొత్తానికి ఒకనాటి తన గురువును కీలక స్థానాన్ని అప్పజెప్పటం ద్వారా గురుదక్షిణ బాగానే చెల్లించుకున్నట్లు చెబుతున్నారు. రిటైర్మెంట్ వయసు దాటి చాలా కాలమే అయినప్పటికి ఇప్పటికి చురుగ్గా ఉండే శాస్త్రి జమానాలో టీ న్యూస్ చానల్ ఎలా ఉంటుందో చూడాలి.