‘మజిలీ’ అతడి సొంత కథే

‘మజిలీ’ అతడి సొంత కథే

సినిమా కథల్లో చాలా వరకు నిజ జీవిత అనుభవాల నుంచే పుడతాయి. తమ జీవితంలోనో.. లేదా స్నేహితులు, సన్నిహితుల జీవితాల్లోనో జరిగిన ఉదంతాలే స్ఫూర్తిగా కథలు అల్లి సినిమాలు తీస్తుంటారు దర్శకులు. కొందరు తమ సొంత కథనే సినిమాగా మలుస్తుంటారు. గత ఏడాది తరుణ్ భాస్కర్ తీసిన ‘ఈ నగరానికి ఏమైంది’ పూర్తిగా అతడి సొంత కథే.

తన ప్రేమకథతో పాటు సినిమా దర్శకుడిగా మారడానికి తాను పడ్డ కష్టం.. చివరగా ‘పెళ్ళిచూపులు’ సినిమా చేసి తనేంటో రుజువు చేసుకోవడం.. ఈ క్రమాన్నే సినిమాగా మలిచాడు తరుణ్. గతంలో ఇలా చాలామంది దర్శకులు సొంత కథల్ని సినిమాలుగా తీసిన వాళ్లే. నాగచైతన్య-సమంతల కొత్త చిత్రం ‘మజిలీ’ కూడా ఈ కోవలోనిదేనట. ఈ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ తన సొంత కథనే సినిమాగా తీసినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తన జీవితంలో ప్రేమ, క్రికెట్, పెళ్లి.. చాలా కీలకమైన విషయాలని.. అవి తన జీవితాన్ని ప్రతి దశలో ఒక గొప్ప మలుపు తిప్పాయని.. ఆ అనుభవాలన్నింటినీ కలిపి ‘మజిలీ’ కథ రాశానని శివ తెలిపాడు. నాగచైతన్య పాత్ర తనదే అన్న శివ.. ఆ పాత్రలో చైతూ పెర్ఫామెన్స్ అద్భుతమని.. తన ఆలోచనల్ని ఆ పాత్రతో చైతూ చాలా గొప్పగా తెరమీదికి తెచ్చాడని.. చైతూలో తనను తాను చూసుకున్నట్లు అనిపించిందని శివ తెలిపాడు. అంటే శివ కూడా నిజ జీవితంలో క్రికెటర్ అన్నమాట. అలాగే అతడికో ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కూడా ఉందన్నమాట. భార్య ప్రవేశంతో అతడి జీవితంలో మార్పు వచ్చిందన్నమాట. ఇంకా ఈ కథలో ఎన్ని మలుపులున్నాయో తెరపైనే చూడాలి. ఇలా తమ కథను తామే తీసి తెరపై చూసుకోవడం గొప్ప అనుభవమే.

‘నిన్నుకోరి’లో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీని అద్భుతంగా తీర్చిదిద్దిన శివ.. ‘మజిలీ’తో మరోసారి మ్యాజిక్ చేసేలాగే కనిపిస్తున్నాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, ఇతర ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. ప్రేమకు నిర్వచనమే మారిపోయిన ఈ రోజుల్లో లవ్ స్టోరీలతో ప్రేక్షకుల్లో ఫీల్ తీసుకురావడం చాలా చాలా కష్టం. శివ లాంటి చాలా కొద్దిమంది దర్శకులు మాత్రమే అలాంటి ఫీల్ తీసుకురాగలరు. మరి ‘నిన్ను కోరి’ లాగే ‘మజిలీ’ కూడా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English