‘ఆర్ఆర్ఆర్’లో ఛాన్సిస్తే రిటర్న్ గిఫ్టిచ్చాడు

‘ఆర్ఆర్ఆర్’లో ఛాన్సిస్తే రిటర్న్ గిఫ్టిచ్చాడు

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఎవరికి ఉండదు. టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ నుంచి నటీనటులు జక్కన్న సినిమాలో అవకాశం కోసం ఎదురు చూసే పరిస్థితి. చాలామంది ఓపెన్‌గా రాజమౌళి చిత్రంలో అవకాశం కోసం ప్రపోజల్స్ పెట్టేసుకున్నారు.  కానీ జక్కన్న మాత్రం తన పాత్రలకు ఎవరైతే సరిపోతారో వాళ్లకు ఛాన్సులిస్తున్నాడు.

తన కొత్త సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో ప్రధాన పాత్రల కోసం ఎంచుకున్న నటీనటుల గురించి జక్కన్న ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన పేరు సముద్రఖనిదే. దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత నటుడిగా మారిన ఈ తమిళుడు జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు. ‘విసారణై’ చిత్రానికి అతను జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా గెలుచుకున్నాడు. దర్శకత్వాన్ని పక్కన పెట్టి ఇప్పుడు పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడతను.

సముద్రఖనిని ‘ఆర్ఆర్ఆర్’లో ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నాడు జక్కన్న. ఇక అప్పటి నుంచి ఉత్తరాది వాళ్లు సైతం అతడి గురించి తెగ వెతికేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాకముందే సముద్రఖని పేరు మార్మోగిపోయింది. తనకు ‘ఆర్ఆర్ఆర్’లో ఛాన్సిచ్చి ఇంత గుర్తింపు తెస్తున్నందుకు జక్కన్నకు సముద్రఖని రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేశాడు. జక్కన్న తనయుడు కార్తికేయ నిర్మాణంలో గుణ్ణం గంగరాజు తనయుడు అశ్విన్ గంగరాజు తీస్తున్న ‘ఆకాశవాణి’లో ఓ కీలక పాత్ర చేయడానికి అంగీకరించాడు సముద్రఖని.

‘ఆర్ఆర్ఆర్’లో భాగమయ్యాకే సముద్రఖని దగ్గరికి ఈ పాత్ర వచ్చిందని, జక్కన్న మీద ఉన్న గౌరవంతో మరో మాట లేకుండా ఆ సినిమా ఒప్పేసుకున్నాడని సమాచారం. ‘ఆకాశవాణి’ ఓ విచిత్రమైన కథతో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక సినిమా. కార్తికేయ తొలిసారి నిర్మాతగా మారి తీస్తున్న చిత్రమిది. ఎక్కువగా కొత్తవాళ్లే ఈ చిత్రంలో నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English