మెగా అమ్మాయి కెరీర్ క్లోజేనా?

మెగా అమ్మాయి కెరీర్ క్లోజేనా?

ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా సరే.. సక్సెస్ లేకుండా ఎంతో కాలం సినీ రంగంలో కొనసాగడం కష్టం. ఒకేసారి తొమ్మిది సినిమాల ప్రారంభోత్సవంతో సంచలనం సృష్టించిన నందమూరి వారసుడు తారకరత్న పరిస్థితి ఏమైందో తెలిసిందే. వరుసగా ఫ్లాపులు ఎదురవడంతో మొదలుపెట్టిన సినిమాలు సైతం ఆపేయల్సిన పరిస్థితి వచ్చింది.

ఇలా విజయాల్లేక కనుమరుగైపోయిన సినీ తారలు చాలామందే ఉంటారు. వర్తమానంలోకి వస్తే మెగా ఫ్యామిలీ నుంచి కథానాయికగా మారిన తొలి అమ్మాయి నిహారిక పరిస్థితి అయోమయంగా ఉంది. తన కుటుంబం నుంచి వచ్చిన అభ్యంతరాల్ని తోసిరాజని.. చిరంజీవి సహా అందరినీ ఒప్పించి సినీ రంగ ప్రవేశం చేసిందామె. కానీ ఆమెకు ఇక్కడ ఆశించిన ఫలితాలు రాలేదు. తొలి సినిమా ‘ఒక మనసు’.. రెండో చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు నిహారిక ఆశలన్నీ ‘సూర్యకాంతం’ మీదే పెట్టుకుంది.

కానీ ఈ చిత్రం నిహారిక తొలి రెండు సినిమాల స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది. అసలేమాత్రం బజ్ లేకుండా రిలీజైన ‘సూర్యకాంతం’ ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. బ్యాడ్ టాక్ రావడంతో తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. వీకెండ్లో కూడా సినిమా ఏమాత్రం జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది. మూడు రోజులు నామమాత్రంగా నడిపించి అప్పుడే సినిమాను థియేటర్ల నుంచి లేపేస్తున్నారు. తెలంగాణ వరకు దీనికి పోటీగా విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నెగెటివ్ టాక్‌ను తట్టుకుని కూడా బాగానే వసూళ్లు రాబడుతుండగా ‘సూర్యకాంతం’ థియేటర్లు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి.

నిహారిక పట్ల జనాలకు ఏమాత్రం ఆసక్తి లేదన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. ‘సూర్యకాంతం’ నిహారిక పాత్ర చుట్టూ తిరిగే సినిమా. కానీ ఆ పాత్రను ఆమె మోయలేకపోయింది. పేలవమైన నటనతో నిరాశ పరిచింది. సినిమా కూడా అంతంతమాత్రమే కావడంతో జనాలు దీన్ని లైట్ తీసుకుంటున్నారు. ప్రణీత్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించాడు. వరుస మూడో ఫ్లాప్ ఎదురైన నేపథ్యంలో నిహారిక కెరీర్ దాదాపుగా క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English