బాబాయ్ 100.. అబ్బాయ్ 1000


మొత్తానికి సంక్రాంతికి ఒక విచిత్ర‌మైన దృశ్యం చూడ‌బోతున్నాం. ఎన్న‌డూ లేని విధంగా మెగా ఫ్యామిలీ అబ్బాయి.. బాబాయి బాక్సాఫీస్ పోరుకు రెడీ అయిపోయారు. జ‌న‌వ‌రి 7న రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ విడుద‌ల కాబోతుండ‌గా.. ఇంకో ఐదు రోజుల‌కే, అంటే జ‌న‌వ‌రి 12న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా భీమ్లా నాయ‌క్ విడుద‌ల కాబోతోంది. ఈ క్లాష్ లేకుండా చూడ‌టానికి కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి కానీ.. అవి ఫ‌లించ‌లేదు. భీమ్లా నాయ‌క్ వాయిదా ప‌డుతుంద‌న్న అంచ‌నాలు నిజం కాలేదు. దీంతో బాబాయ్-అబ్బాయ్ క్లాష్ అనివార్యం అయింది.

ఈ విష‌యంలో మెగా అభిమానుల్లో ఓ వ‌ర్గం అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. ఆర్ఆర్ఆర్ మీద ఉన్న భారీ అంచ‌నాల వ‌ల్ల భీమ్లా నాయ‌క్ మీద దెబ్బ ప‌డుతుంద‌ని కొంద‌రు.. ఆర్ఆర్ఆర్‌కే భీమ్లా నాయ‌క్ డెంట్ వేస్తుంద‌ని ఇంకొంద‌రు వాదిస్తున్నారు. ట్విట్ట‌ర్లో మెగా అభిమానుల్లోనే కొంత డిష్యుం డిష్యుం న‌డుస్తోంది. వీరిని రెచ్చ‌గొట్ట‌డానికి కూడా వేరే హీరోల అభిమానులు ప్ర‌య‌త్నిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఐతే దీన్ని బాబాయ్-అబ్బాయ్ క్లాష్ లాగా చూడాల్సిన ప‌ని లేద‌ని.. సంక్రాంతికి రెండు మూడు భారీ సినిమాలు రిలీజైనా ఇబ్బంది లేద‌ని.. అన్నింటికీ మంచి వ‌సూళ్లే వ‌స్తాయ‌ని.. రెండూ కంటెంట్ ఉన్న సినిమాల్లాగే క‌నిపిస్తుండ‌టంతో రెండూ అనుకున్న స్థాయిలో విజ‌యవంతం అవుతాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సినిమాల‌తో ప‌వ‌న్, చ‌ర‌ణ్ బిగ్ టార్గెట్ల‌ను అందుకునే అవ‌కాశాల మీదా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆర్ఆర్ఆర్‌తో రూ.1000 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల క్ల‌బ్‌లో చ‌ర‌ణ్ చేర‌బోతున్నాడ‌ని.. అత‌ను పాన్ ఇండియా స్టార్‌గా అవ‌త‌రిస్తాడ‌ని.. మ‌రోవైపు ప‌వ‌న్ ఇప్ప‌టిదాకా త‌న‌ను ఊరిస్తున్న రూ.100 కోట్ల షేర్ మార్కును ట‌చ్ చేస్తాడ‌ని.. సంక్రాంతి సీజ‌న్ క‌చ్చితంగా ఇద్ద‌రికీ క‌లిసొస్తుంద‌ని.. కాబ‌ట్టి అభిమానులు త‌మ‌లో తాము కొట్టుకోవ‌డం మాని ఇద్దరి విజ‌యాల‌ను ఆస్వాదించ‌డం చేయాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు.