సమీక్ష: డిస్కోరాజా

2/5

2Hrs 30 Mins   |   Action   |   24-01-2020


Cast - Raviteja, Payal Rajput, Nabha Natesh, Bobby Simha, Sunil, Vennela Kishore and Others

Director - VI Anand

Producer - Rajani Talluri

Banner - SRT Entertainments

Music - Thaman

ఏ దర్శకుడైనా ఎలాంటి కథ, ఎలాగైనా చెప్పొచ్చు. కానీ రెండు విషయాలు కీలకంగా దృష్టిలో పెట్టుకునే ఏ దర్శకుడైనా సినిమా చేయాలి.

తను చెబుతున్న విషయం ప్రేక్షకుడికి అర్థం అవుతోందా? లేదా?

తను తీస్తున్నది ప్రేక్షకుడు ఆసక్తిగా చూడగలగుతున్నాడా? లేదా?

అలా కాకుండా, తన మానాన తను తీసుకుంటూ పోయి, తన మేథావితనం అంతా రంగరించిపోసి, కళా ఖండం తీసాను…చూస్కోండి..చూస్కోండి అంటే చూసేయడానికి ప్రేక్షకులు సిద్దంగా వుండరు. పైగా 100 నుంచి 200 టికెట్ పెట్టి రావడానికి అసలే సిద్దంగా వుండరు. కీలకమైన ఈ విషయం గమనించకుండా, పట్టించుకోకుండా సినిమా తీసి జనం మీదకు వదిలారు దర్శకుడు విఐ ఆనంద్.

అదే ఈవారం విడుదలయిన డిస్కోరాజా. కనీసం తను ఏ హీరోతో సినిమా తీస్తున్నాను, ఆ హీరో టార్గెట్ ఆడియన్స్ ఏమిటి? వాళ్లను సంతృప్తి పరచడానికి తను అందిస్తున్న కంటెంట్ సరిపోతుందా? లేదా? సహకరిస్తుందా? లేదా? అన్నది కూడా గమనించకోలేదు.

దర్శకుడు విఐ ఆనంద్ కు కాస్త వైవిధ్యమైన సినిమాలు తీస్తారని పేరు వుంది. సైన్స్ ఫిక్షన్, సూపర్ నాచురల్ పవర్స్ ఇలాంటి వాటి మీద ఆయనకు ఆసక్తి వుంది. ఆ దిశగానే డిస్కోరాజా సినిమా కూడా మొదలవుతుంది. దాంతో ఆయన సినిమాలు నచ్చేవారికి, లేదా వైవిధ్యమైన కథాంశం అనుకునేవారికి కాస్త ఆసక్తి జనరేట్ అవుతుంది.

మంచుకొండల్లో మైనస్ 40 డిగ్రీలకు పైగా చల్లదనంలో మూడు దశాబ్దాలకు పైగా వుండిపోయిన హీరో శరీరాన్ని తీసుకువచ్చి, ఫ్రాణ ప్రతిష్ట చేస్తారు సైంటిస్టులు కమ్ డాక్టర్లు. అంతవరకు బాగానే వుంటుంది. కానీ అలా చచ్చి బతికిన హీరో కి గతం గుర్తుకు వచ్చిన తరువాతే అరాచకం మొదలవుతుంది.

ఎందుకంటే ఈ ఇంట్రడక్షన్ తప్ప మిగిలిన కథ అంతా పరమ రొటీన్. పరమ నాటు సరుకు. సినిమా కథ ఒక విధంగా విసిగిస్తే చాలదు అని దర్శకుడు ముందే డిసైడ్ అయిపోయినట్లున్నాడు. అందుకే చాలా అంటే చాలా అంశాలు జోడించాడు. తమిళనాడు నేఫథ్యం. తమిళంలో డైలాగులు, పదిపైసలు పాత్ర కూడా లేని ముగ్గురు హీరోయిన్లు, జనాలకు అర్థం కాని డాన్ వ్యవహారాలు. అస్సలు చివరికంటా చూసాక కానీ వేరే విలన్ కూడా వున్నాడ్రోయ్ అని అనుకునే ట్విస్ట్,  రౌడీ గ్యాంగ్ ల్లో వారికి కూడా మేనరిజమ్ లు, ఇలా ఒకటేమిటి సవాలక్ష వ్యవహారాలు కథలో కుక్కేసారు. కానీ కథలో కథమైనా వుందా అంటే వడ్ల గింజలో బియ్యం గింజ అంత.

తమిళనాట చేరి దందాలు చేస్తుంటాడు డిస్కోరాజా (రవితేజ) దందాలకు డిస్కోకు, డిస్కో మ్యూజిక్ కు, డిస్కో డ్యాన్స్ లకు సింక్ ఏమిటి? సంబంధం ఏమిటి? అని మాత్రం అడక్కండి. దాంతో కౌంటర్ పార్ట్ విలన్ (బాబీ సింహా) అతగాడిని చంపేస్తాడు. కానీ అదృష్టం కొద్దీ మంచులో ఫ్రీజ్ అయిపోయి, మళ్లీ బతికేస్తాడు. కానీ అప్పటికే అతగాడికి ముఫై ఏళ్ల కొడుకు వుంటాడు. వాడి వ్యవహారం వేరు. వీడి వ్యవహారం వేరు. వాళ్ల పగలు వేరు. ఇదీ చిక్కులు జాగ్రత్తగా విడదీస్తే చెప్పగలిగిన సినిమా కథ.

సినిమా ఎత్తుగడ 20 నిమషాలు బాగుంటుంది. దర్శకుడి అభిరుచి గుర్తుకు వచ్చి కాస్త ఆశలు కలుగుతాయి. కానీ ఆ తరువాత నుంచి విశ్రాంతి వరకు హీరోకు గతం గుర్తుకు తేవడంతోనే సరిపెట్టాడు. హీరో గతం, ఆ తరువాత మళ్లీ వర్తమానం..ఇదంతా విశ్రాంతి తరువాత భాగం కోసం దాచుకున్నాడు దర్శకుడు. విశ్రాంతి కార్డ్ పడి బయటకు వచ్చిన ప్రేక్షకుడు, ఈ ఒక్క పాయింట్ దగ్గరకు సినిమాను తీసుకురావడం కోసం సగం సినిమా లాగాడా దర్శకుడు అని అనుకుంటాడు. అలాగే అసలు ఇలాంటి రొటీన్ ఫార్ములా కథలోకి తీసుకురావడానికి ఇంత సైంటిఫిక్ బిల్డప్ ఎందుకు అని కూడా అనుకుంటాడు.

సరే, అసలు కథ ప్రారంభమైంది కదా, చూద్దాం అని తరువాయి భాగంలోకి ఎంటర్ అయితే, అప్పుడు తెలిసి వస్తుంది. సినిమా రెంటికి చెడిన రేవడి అని. అటు దర్శకుడు ఆనంద్ స్టయిల్ సైంటిఫిక్ లేదా సూపర్ నాచురల్ పవర్స్ వ్యవహారం లేదు. అలా అని ఇటు రవితేజ మార్కు ఫన్ లేదు అని. ఇద్దరు హీరోలను పెట్టుకుని, ఒక హీరో (అదీ రవితేజనే) ను డమ్మీ చేసాడు. ముగ్గురు హీరోయిన్లను పెట్టుకుని, ఒక హీరోయిన్ (నభా నటేష్)ను గెస్ట్ రోల్ కు పరిమితం చేసాడు. మరో హీరోయిన్ (పాయల్ రాజ్ పుత్) ను చెముడు..మూగదాన్ని చేసాడు. మూడో హీరోయిన్ (తాన్యా హోప్) నే కాస్త ఫరవాలేదు.

రెండో హీరో రవితేజను దాదాపు డమ్మీ చేసేసాడు దర్శకుడు. ఆ మాత్రం దానికి డబుల్ రోల్ ఎందుకనో? విలన్ కాస్సేపు కన్ఫ్యూజ్ కావడానికి తప్ప మరెందుకు పనికిరాదు. కేవలం బాలీవుడ్ ఓల్డ్ డైలాగులు, సెటప్, గెటప్ ఇవి చూసి హీరో రవితేజ సై అనేసి వుంటాడు. కానీ అవన్నీ కలిపి కుట్టింది ఓ పరమ రొటీన్ కథలో అని చూసుకోలేదు.

పోనీ కథ ఇలాంటిదైనా, సెటప్ ఇలాంటిదైనా పద్దతిగా జనాలకు అర్థం అయ్యేలా, మేధావితనాన్ని తమిళ, ఇంగ్లీష్ డైలాగులను పక్కన పెట్టి తీస్తే కనీసం రవితేజ ఫ్యాన్స్, బి, సి సెంటర్ జనాలు అయితే చూసేవారు. కానీ అదీ చేయలేదు. ఇలా మొత్తం మీద అయ్యవారి బొమ్మ చేయబోతే కొతి బొమ్మ తయారైందన్న చందంగా దర్శకుడు డిస్కోరాజాను తయారుచేసి వదిలాడు.

ఇలాంటి సినిమాకు డబ్బులు బాగానే పోసేసారు.తెర మీద అవి కనిపిస్తున్నాయి. ఫామ్ లో వున్న థమన్ ఇచ్చిన మంచిట్యూన్ లు తెరమీద అంతకు మించి చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. వింటేజ్ సాంగ్ ‘నాతో నీవేం అన్నావో’ ను అత్యంత నీరసంగా చిత్రీకరించాడు. థమన్ నేపథ్య సంగీతంలో సెకండాఫ్ లో ఆ డిస్కో థీమ్ తప్ప మరేం లేదు. అబ్బూరి రవి నే డైలాగులు రాసాడా? అన్న అనుమానం కలుగుతుంది.

రవితేజ ఇటీవల కన్నా ఈ సినిమాలో బాగున్నాడు. మాగ్జిమమ్ బాగా చేయడానికి ట్రయ్ చేసాడు. కానీ దర్శకుడు ఆ అవకాశం తక్కువ ఇచ్చాడు. సునీల్ కు మంచి పాత్ర దొరికింది. క్లయిమాక్స్ లో బి, సి సెంటర్ల ఆడియన్స్ చేత బాగా చేసాడుగా అనిపించుకుంటాడు. అంతకు మించి మరేం లేదు నటీనటుల పరంగా.

టోటల్ మంచి బడ్జెట్, మంచి స్టార్ట్ కాస్ట్, అన్నీ కదిరి, కేవలం దర్శకుడి వైఫల్యం వల్ల ఫెయిల్ అయిన సినిమాల జాబితాలో చేరుతుంది డిస్కోరాజా.

రేటింగ్: 2/5
ఫినిషింగ్ టచ్...థియేటర్లోంచి ‘ఉస్కో’ రాజా