ఈ డైరెక్ట‌ర్.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మెషీన్


20 ఏళ్ల కెరీర్లో అప‌జ‌యం అన్న‌దే లేకుండా సాగిపోతున్నాడు మ‌న ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. ఐతే ఆయ‌న‌కు విజ‌యాలేమీ ఊరికే వ‌చ్చేయ‌లేదు. ఒక‌ప్పుడు మామూలు సినిమాలే తీసినా.. ఆ త‌ర్వాత మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబ‌లి.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు తీయ‌డానికి రాజ‌మౌళి ఎంతెంత క‌ష్ట‌ప‌డ్డాడో అంద‌రికీ తెలుసు.

ఐతే బాలీవుడ్లో ఇలా పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే వంద‌ల కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టే సినిమాలు అందించే ద‌ర్శ‌కుడొక‌డున్నాడు. అత‌నే రోహిత్ శెట్టి. అత‌నే కళాఖండాలు తీయ‌డు. మామూలు మాస్ మ‌సాలా సినిమాలే చేస్తుంటాడు. కానీ మాస్ ప‌ల్స్ బాగా తెలిసిన అత‌డికి బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. ఇంత‌క‌ముందు వ‌చ్చిన సినిమాల నుంచి ఇన్‌స్పైర్ అవుతాడు. లేదంటే వేరే భాష నుంచి సినిమా తీసుకుని రీమేక్ చేస్తాడు. ఎలా చేసినా.. మాస్‌ను అల‌రించ‌డం మాత్రం బాగా తెలుసు.

ఇలాగే ఇప్ప‌టిదాకా 8 వంద కోట్ల సినిమాలు అందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు అత‌డి నుంచి తొమ్మిదో వంద కోట్ల సినిమా వ‌చ్చింది. అదే సూర్య‌వంశీ. క‌రోనా దెబ్బ‌కు విల‌విల‌లాడిపోయిన బాలీవుడ్‌కు ఊపిరి పోసిన చిత్ర‌మిది. కేవ‌లం వంద కోట్ల‌తో ఆగిపోకుండా.. వ‌ర‌ల్డ్ వైడ్ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును కూడా దాటేసిందీ సినిమా. ఫుల్ ర‌న్లో రూ.250 కోట్ల మార్కును కూడా అందుకునేలా ఉంది.

సూర్య‌వంశీకి మ‌రీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. ఇది కూడా రోహిత్ మార్కు రొటీన్ మాస్ మ‌సాలా సినిమానే. కానీ అభిమానుల‌కు, మాస్ ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్‌కు లోటు లేదు. దీనికంటే ముందు రోహిత్‌.. టెంప‌ర్ సినిమాను రీమేక్ చేశాడు. సింబా పేరుతో వ‌చ్చిన ఆ సినిమా ప్రోమోలు చూసి టెంప‌ర్‌ను చెడ‌గొట్టేశార‌నే అభిప్రాయం క‌లిగింది. కానీ ఆ సినిమా కూడా రూ.200 కోట్ల దాకా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం విశేషం.