తమన్ ఈ స్థాయిలో ఉన్నది అందుకే..

తమన్ ఈ స్థాయిలో ఉన్నది అందుకే..

గత దశాబ్ద కాలంలో టాలీవుడ్ సంగీత దర్శకుల్లో తమన్ ఎదుర్కొన్నంత సోషల్ మీడియా ట్రోల్ మరెవ్వరూ ఎదుర్కొని ఉండరు. ఒకే రకం పాటలిస్తుంటాడని.. కాపీ కొడతాడని.. ఇలా రకరకాల విమర్శలు ఎదుర్కొన్నాడు తమన్. ‘అరవింద సమేత’ సినిమా విషయంలోనూ తమన్‌కు ఇలాంటి కామెంట్స్ తప్పలేదు. ఈ విషయంలో తమన్ ఇచ్చే వివరణను కూడా ఎవ్వరూ పట్టించుకోరు.

ఐతే బేసిగ్గా తమన్ చాలా సాఫ్ట్ కాబట్టి ఎవరినీ ఏమీ అనడు. ఏ విమర్శ వచ్చినా భరిస్తుంటాడు. ఇక్కడే తమన్ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇండస్ట్రీ జనాలు తమన్‌ను అమితంగా ఇష్టపడటానికి సంగీతాన్ని మించిన కారణాలుంటాయి. తమన్ ఎప్పుడూ ఎవ్వరి మనసూ నొప్పించాడు. తాను పని చేసే అందరితో చాలా సరదాగా ఉంటాడు. చాలా వేగంగా పని పూర్తి చేశాడు. సమయానికి ఔట్ పుట్ ఇస్తాడు. ఏదైనా సినిమా సంగీత పరంగా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే ఆదుకోవడానికి ముందుకొస్తాడు.

మామూలుగా ఒక సంగీత దర్శకుడు పని చేస్తున్న సినిమాలో భాగస్వామ్యం తీసుకోవడానికి పేరున్న మరో సంగీత దర్శకుడు అసలు ఒప్పుకోడు. కానీ తమన్ మాత్రం వేేరే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్న సినిమా కోసం ఒకటో రెండో పాటలు ఇవ్వమంటే వెనుకంజ వేయడు. ‘అఖిల్’ సహా ఇలా పలు సినిమాలకు అతను పాటలిచ్చాడు. అలాగే పాటలు పూర్తయ్యాక నేపథ్య సంగీతం దగ్గర ఏదైనా సమస్య వస్తే.. తమన్ ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

సినిమాకు సంగీత దర్శకుడు వేరైనప్పటికీ.. టీజర్ల కోసం తమన్ సేవలు వాడుకున్న సందర్భాలూ బోలెడు. ‘సైరా’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు.. ‘సాహో’ తొలి మేకింగ్ వీడియోకు అతనే మ్యూజిక్ చేశాడు. తమన్ స్థాయికి అవి చిన్న పనులే. కానీ అతను భేషజం లేకుండా పని చేసి పెట్టాడు.

ఇప్పుడు ‘మజిలీ’ చిత్రానికి చివరి దశలో సంగీత దర్శకుడు గోపీసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేని పరిస్థితి వస్తే తమనే ఆదుకున్నాడు. ఈ విషయంలో చిత్రబృందమంతా తమన్‌ను తెగ పొగిడేసింది. దర్శకుడు శివ నిర్వాణ అయితే.. తమన్‌ను దేవుడిగా అభివర్ణించాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా.. గోపీ ఈ సినిమాకు పని చేయలేని పరిస్థితి వస్తే తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని.. ఆ పరిస్థితుల్లో తమన్ వచ్చి చాలా తక్కువ సమయంలో గొప్ప ఔట్ పుట్ ఇచ్చాడని అతను చాలా ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు. పని చేసేది డబ్బులకే అయినా.. ఇలా ఆపద్బాంధవ పాత్ర అందరూ పోషిచలేరు. అందుకే ఇండస్ట్రీ జనాలు తమన్‌ది గోల్డెన్ హార్ట్ అంటుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English