నాగ్-వెంకీ.. ఆ కెమిస్ట్రీయే వేరు

నాగ్-వెంకీ.. ఆ కెమిస్ట్రీయే వేరు

అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లు బావ-బావమరిది అన్న సంగతి తెలిసిందే. వెంకీ చెల్లి లక్ష్మినే నాగ్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్లిద్దరికీ పుట్టిన కొడుకే నాగచైతన్య. ఐతే చైతూ పుట్టిన కొంత కాలానికి నాగ్-లక్ష్మిల మధ్య విభేదాలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. తర్వాత ఎవరికి వారు వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నారు. ఐతే వీళ్లిద్దరి విడాకుల వల్ల అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకపోవడం, ఇరు కుటుంబాల వాళ్లు తర్వాత కూడా స్నేహభావంతో మెలగడం విశేషమే.

మామూలుగా ఇలా డైవర్స్ జరిగితే.. రెండు కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోతాయి. ఒకరితో ఒకరు కలవడానికి ఇబ్బంది పడతారు. అందులోనూ తన చెల్లి నుంచి విడిపోయిన వ్యక్తితో అన్న కలివిడిగా ఉండటం కొంత ఇబ్బందికరమే. కానీ వెంకీ-నాగ్ మాత్రం అలాంటి ఇబ్బందికర స్థితిలో ఎప్పుడూ లేరు. ఎప్పట్లాగే క్లోజ్ ఫ్రెండ్స్ లాగా సాగిపోతున్నారు.

బహుశా వీళ్లిద్దరూ స్నేహితులుగా కొనసాగడానికి కారణం చైతూనే అయ్యుండొచ్చు. చైతూ తల్లి.. తండ్రి వేరే పెళ్లిళ్లు చేసుకున్నాక చైతూను దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు చాలా బాగా చూసుకున్నాయి. ఇరు కుటుంబాల ముద్దుల బిడ్డ అయ్యాడతను. నాగ్-వెంకీల మధ్య స్నేహం ఇంకా ఎంత చక్కగా ఉందో చెప్పడానికి తాజాగా జరిగిన ‘మజిలీ’ ప్రి రిలీజ్ ఈవెంట్ నిదర్శనం. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన వీళ్లిద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. పక్క పక్కన కూర్చుని జోకులు పేల్చుకుంటూ సరదాగా గడిపారు.

తర్వాత వేదిక మీద కూడా వీళ్లిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. వెంకీ తన ప్రసంగం పూర్తి చేశాక.. ఇప్పుడిక నాగార్జున మాట్లాడతాడు. అదగరొట్టేస్తాడు అంటూ మైక్ నాగ్‌కు అందజేశాడు. నాగ్ గొల్లుమని నవ్వుతూ మైక్ అందుకున్నాడు. వెంకీ అన్నట్లుగానే నాగ్ స్పీచ్ అదిరిపోయింది. ఆయన చైతూ-సమంతల మీద జోకులు పేలుస్తుంటే వెంకీ భలే ఎంజాయ్ చేశాడు. మొత్తంగా వీళ్లిద్దరి కెమిస్ట్రీనే ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English