సమంతకు మహేష్ ఇచ్చిన ఉత్తమ సలహా

సమంతకు మహేష్ ఇచ్చిన ఉత్తమ సలహా

మహేష్ బాబు-సమంతలది విచిత్రమైన బంధం. ఒక సమయంలో వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. కానీ ఒక దశలో వీరి మధ్య వైరం నెలకొంది. తెలుగులో సమంత రెండో సినిమానే మహేష్ బాబుతో చేసింది. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కూడా బాగానే ఆడింది.

ఐతే మహేష్ ‘1 నేనొక్కడినే’ చేస్తున్న సమయంలో ఆ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ మీద సామ్ చేసిన కామెంట్ దుమారం రేపింది. దీనిపై అభిమానులే కాదు.. మహేష్ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఐతే తర్వాత ఇద్దరి మధ్య అంతా సర్దుకుంది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ‘బ్రహ్మోత్సవం’ సినిమా కూడా చేశారు. ఇదిలా ఉంటే.. మహేష్ తన కెరీర్లో చాలా ప్రత్యేకమైన హీరో అని.. ‘దూకుడు’ చేస్తున్న సమయంలో అతడిచ్చిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని అంటోంది సామ్.

‘దూకుడు’ చేసే సమయానికి తనకు పెద్దగా అనుభవం లేదని.. కానీ మహేష్ పెద్ద సూపర్ స్టార్ అని.. అయినా తనతో చాలా మామూలుగా ఉన్నాడని సమంత చెప్పింది. ఈ సినిమా చేస్తున్నపుడు మహేష్ ఇచ్చిన గొప్ప సలహా ఇచ్చాడని.. తన కెరీర్లో అదే అత్యుత్తమ సలహా అని సామ్ చెప్పింది. ‘ఎన్ని సినిమాలు చేసినా.. ప్రతిసారీ ఇదే నా కొత్త సినిమా అనుకుని నటించడం మొదలుపెట్టు’ అని మహేష్ సలహా ఇచ్చాడని.. దాన్ని ఇప్పటికీ పాటిస్తున్నానని.. ఎప్పటికీ పాటిస్తానని సమంత చెప్పింది.

ఇదే తొలి సినిమా అనుకుంటే భయం ఉంటుందని.. అంకిత భావంతో పని చేస్తామని.. అలసత్వం దరి చేరనివ్వమని సమంత చెప్పింది. పెళ్లయినప్పటికీ తన కెరీర్ దివ్యంగా నడుస్తోందని.. ప్రస్తుతం తన కెరీర్లో ‘రెగ్యులర్’ అనే మాటకు చోటే లేదని.. ఏదో ఒక ప్రత్యేకత లేని పాత్ర ఏదీ చేసే అవకాశమే లేదని.. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలు వచ్చినంత కాలం చేసుకుంటూ పోతానని సమంత చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English