సూరిబాబు లవంగం... ఓవర్ టు కిషోర్

సూరిబాబు లవంగం... ఓవర్ టు కిషోర్

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం కెరీర్లో మైలురాయిలా నిలిచిన పాత్రల్లో సూరిబాబు లవంగం ఒకటి. మన్మథుడు చిత్రంలోని ఈ పాత్రకు స్క్రీన్ టైం మరీ ఎక్కువేమీ ఉండదు. మహా అయితే ఒక 20 నిమిషాలు కనిపిస్తుందంతే. కానీ ఆ 20 నిమిషాల్లోనే పతాక స్థాయి వినోదాన్ని పంచింది బ్రహ్మి పాత్ర.

ఎయిర్ పోర్టులో సూరిబాబు లవంగం అంటూ తన పాత్రను పరిచయం చేసుకోవడం దగ్గర్నుంచి.. ‘‘ఎప్పుడైనా ప్యారిస్ రండి.. కానీ మా ఇంటికి మాత్రం రావొద్దు’’ అంటూ నాగ్-సోనాలిల ముఖాల మీద డోర్ వేసే సీన్ వరకు బ్రహ్మి పాత్ర ఉర్రూతలూగించేస్తుంది. ఈ సినిమా వచ్చి దశాబ్దంన్నర దాటుతున్నా.. ఇప్పటికీ టీవీలో ఆ కామెడీ వస్తే పనులన్నీ ఆపేసి అతుక్కుపోతాం. అంత ప్రభావం చూపిన పాత్రకు ఇప్పుడు కొనసాగింపు రాబోతోందని సమాచారం.

‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్ ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో సూరిబాబు లవంగంను పోలిన పాత్ర ఉంటుందట. కానీ ఇందులో బ్రహ్మానందం నటించట్లేదు. బ్రహ్మి పనైపోయి రెండేళ్లు దాటింది. ఆయన సినిమాల్లో కనిపించడమే కష్టమైపోతోంది. ఇప్పుడు ఆయన్ని ఎవ్వరూ సంప్రదించడం కూడా లేదు.

‘మన్మథుడు-2’లో ఉన్నది సూరిబాబు లవంగం కొడుకు పాత్ర అయ్యుండొచ్చని.. ఇది కూడా ఫారిన్ ఎపిసోడ్లోనే ఎంటరవుతుందని చెబుతున్నారు. ఈ పాత్రలో వెన్నెల కిషోర్ నటిస్తాడని సమాచారం. రాహుల్ రవీంద్రన్‌కు కిషోర్ చాలా క్లోజ్ ఫ్రెండ్. వీళ్లిద్దరూ కలిసి ‘అలా ఎలా’ సహా కొన్ని సినిమాల్లో నటించారు. దర్శకుడిగా రాహుల్ తొలి సినిమా ‘చి ల సౌ’లోనూ కిషోర్ ఓ మంచి పాత్ర చేసి వినోదం పంచాడు. ‘మన్మథుడు-2’లో దానికి మించి వినోదం పంచేలా అతడి పాత్ర ఉంటుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English