టాలీవుడ్ తుస్.. బాలీవుడ్ భేష్

టాలీవుడ్ తుస్.. బాలీవుడ్ భేష్

గత ఏడాది టాలీవుడ్‌కు బాగానే కలిసొచ్చింది. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’తో పాటుగా రెండంకెల సంఖ్యలో హిట్లు వచ్చాయి. దీంతో 2019 మీద మరిన్ని ఆశలు పెట్టుున్నారు సినీ జనాలు. కానీ కొత్త ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోగా.. ఒక్క బ్లాక్ బస్టర్ మాత్రమే వచ్చింది. అదే.. ఎఫ్-2. సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది. అంచనాల్ని మించి భారీ విజయం సాధించింది. కానీ మరో సినిమా ఏది కూడా దానికి దరిదాపుల్లోనూ నిలవలేకపోయింది.

చాలా తక్కువ పెట్టుబడితో తీసిన ‘118’ లాభాలు తెచ్చిపెట్టి హిట్ అనిపించుకుంది కానీ.. బాక్సాఫీస్‌లో మాత్రం ఉత్సాహం తీసుకురాలేకపోయింది. ఏదో హిట్ అంటే హిట్ అనుకోవాల్సిందే తప్ప.. ఇది కూడా ప్రేక్షకుల్ని పూర్తిగా రంజింపజేసిన సినిమా కాదు. ఇక మిగతా సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.

టాలీవుడ్ పరిస్థితి ఇలా ఉంటే.. గత ఏడాది పేలవమైన సక్సెస్ రేట్ నమోదు చేసిన బాలీవుడ్ మాత్రం కొత్త ఏడాదిలో దూసుకెళ్లిపోతోంది. ఈ మూడు నెలల్లోనే హిందీలో అరడజనుకు పైగా హిట్లుండటం.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. వీటన్నింటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ‘యురీ’ గురించే. జనవరి 11న పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రూ.250 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి చరిత్ర సృష్టించింది.

కంగనా రనౌత్ సినిమా ‘మణికర్ణిక’.. రణ్వీర్ సింగ్ మూవీ ‘గల్లీ బాయ్’.. మల్టీస్టారర్ కామెడీ మూవీ ‘టోటల్ ఢమాల్’.. అక్షయ్ కుమార్ సినిమా ‘కేసరి’ సైతం అలవోకగా రూ.100 కోట్ల మార్కును దాటేశాయి. లుకా చుప్పి.. బద్లా లాంటి లో బడ్జెట్ మూవీస్ సైతం రూ.100 కోట్ల దిశగా అడుగులు వేస్తున్నాయి. తొలి మూడు నెలల్లో రూ.1000 కోట్ల వసూళ్లు రావడం బాలీవుడ్ చరిత్రలోనే ఇదే తొలిసారి అని ట్రేడ్ పండిట్లు చెబుతుండటం విశేషం. మరి తర్వాతి 9 నెలల్లో బాలీవుడ్ సినిమాలుు ఇంకెన్ని వేల కోట్లు కొల్లగొడుతాయో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English