జెర్సీ.. ఆషామాషీ వ్యవహారం కాదు

జెర్సీ.. ఆషామాషీ వ్యవహారం కాదు

క్రీడల నేపథ్యంలో తెలుగులో అథెంటిక్ సినిమాలు చాలా చాలా తక్కువ. ఆ నేపథ్యం తీసుకున్నా కూడా ఏదో పైపైన చూపించి వదిలేయడమే తప్ప.. లోతుల్లోకి వెళ్లి రియలిస్టిగ్గా సినిమాలు తీసిన వాళ్లు చాలా తక్కువమంది. ‘గోల్కొండ హైస్కూల్’ లాంటి చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ కోవలో కనిపిస్తాయి. ఐతే ఇప్పుడు నాని హీరోగా వస్తున్న ‘జెర్సీ’ ఒక క్రికెటర్ జీవితాన్ని చాలా డీప్‌గానే చూపించినట్లు స్పష్టమవుతోంది.

‘గోల్కొండ హైస్కూల్’ను మించి ఇందులో అథెంటిసిటీ కనిపిస్తోంది. క్రికెట్ మీద లోతైన పరిజ్ఞానంతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా తెరకెక్కించినట్లున్నాడు. దీని టీజర్లోనే ఈ విషయం స్పష్టమైంది. తాజాగా ‘జర్నీ ఆఫ్ జెర్సీ’ పేరుతో ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అందులో చిత్ర బృందం.. ముఖ్యంగా నాని పడ్డ కష్టం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఈ సినిమా కోసం ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా 70 రోజుల పాటు ఒక క్రికెట్ కోచ్ ఆధ్వర్యంలో నాని సీరియస్‌గా క్రికెట్ సాధన చేయడం విశేషం. నానికి క్రికెట్ ఆడిన అనుభవం ఉంది కానీ.. రెండు నెలలకు పైగా ఒక కోచ్ ఆధ్వర్యంలో నెట్స్ సాధన చేయడంతో ఈ ఆటపై బాగా పట్టువచ్చింది. అతను ఎంతో సాధన చేసి అన్ని క్రికెటింగ్ షాట్ల మీద పట్టు సాధించి.. ఆపై రంగంలోకి దిగాడు. సినిమాకు సంబంధించిన సన్నివేశాల్లో నాని చాలా సాధికారికంగా షాట్లు ఆడటం వెనుక ఇంత కష్టం ఉందని ఈ వీడియో చూశాకే అర్థమవుతోంది.

ఇక షూటింగ్‌లో సైతం చాలా కష్టం ఉన్న సంగతి ఈ వీడియోలో స్పష్టమైంది. ఈ సినిమా కోసం 130 మంది దాకా ప్రొఫెషనల్ క్రికెటర్లు పని చేశారట. 19 మంది ఇంగ్లిష్ ప్రొఫెషనల్ క్రికెటర్లూ దీనిలో భాగమయ్యారు. 2 అంతర్జాతీయ మైదానాల్లో.. 5 డొమెస్టిక్ గ్రౌండ్స్‌లో 25 రోజుల పాటు నిర్విరామంగా క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించిన దృశ్యాల చిత్రీకరణ జరిగిందట. మొత్తానికి క్రికెట్ మీద సినిమా అంటే ఏదో పైపైన లాగించేయకుండా ఇంత కష్టపడి అథెంటిసిటీ కోసం ప్రయత్నించినందుకు ‘జెర్సీ’ టీంను అభినందించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English