వర్మ కబుర్లు ఇలాగే ఉంటాయ్ మరి

వర్మ కబుర్లు ఇలాగే ఉంటాయ్ మరి

అబద్ధాల్ని నిజాలుగా.. నిజాల్ని అబద్ధాలుగా నమ్మించగల నేర్పరితనం కొద్దిమందికే ఉంటుంది. వాళ్లు ఒక విషయం చెబుతున్నపుడు.. ఇది కచ్చితంగా వాస్తవమే అయ్యుంటుంది అనే రకంగా నమ్మబలుకుతారు. కానీ తర్వాత కానీ వాస్తవం బోధపడదు. రామ్ గోపాల్ వర్మ ఈ కోవకే చెందుతాడు. గతంలో ఒక ఇంటర్వ్యూ ఆరంభంలో వర్మ ఓ విషయం చాలా సీరియస్‌గా చెప్పాడు. ఇంటర్వ్యూ మధ్యలోకి వచ్చేసరికి దానికి భిన్నమైన మాట చెప్పాడు. అదేంటి ముందు అలా అన్నారే అని అడిగితే.. నేను ముందు చెప్పింది మీరు నమ్మేశారా అంటూ వేళాకోళం చేశాడు. అలా ఉంటుంది వర్మ వ్యవహారం. ఇంతకీ ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు అంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో లక్ష్మీపార్వతికి అసలే సంబంధం లేదని.. ఆమెను తాను కలవనే లేదని.. సినిమాకు సంబంధించి ఎలాంటి ఇన్ పుట్స్ తీసుకోలేదని చెప్పాడు.

ఈ మాటల్ని నమ్మిన వాళ్లు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చూసి ఆశ్చర్యపోతున్నారు. బహుశా ఇప్పటిదాకా లక్ష్మీపార్వతికి మాటల రూపంలో కూడా ఎవ్వరూ ఇవ్వలేని ఎలివేషన్ సినిమాలో ఇచ్చాడు వర్మ. ఒక రకంగా చూస్తే ఆమె కోసమే ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది. ‘మహానటి’ సినిమాలో సావిత్రి కంటే కూడా ఇందులో లక్ష్మీపార్వతికి ఎలివేషన్ ఎక్కువ ఇచ్చాడు వర్మ. లక్ష్మీ పార్వతిలో మంచి లక్షణాలు ఉండొచ్చు కానీ.. ఆమెకు తెలుగుదేశం పార్టీ రాజకీయాలతో అసలు సంబంధమే లేదన్నట్లు, ఆమె ఉత్త అమాయకురాలన్నట్లు చూపించారు. 90ల్లో ఎన్టీఆర్ వెంట ఉంటూ ఆమె పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన విషయం బహిరంగ రహస్యం. కానీ సినిమాలో మాత్రం ఆమె రాజకీయాల్లో అసలేమాత్రం జోక్యం చేసుకోలేదన్నట్లుగా ప్రొజెక్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. సినిమాలో చాలా సన్నివేశాల్లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మాత్రమే కనిపిస్తారు. వాళ్లిద్దరి మధ్య ఆంతరంగికంగా నడిచిన వ్యవహారాలు, సంభాషణల్ని చూపించారు. సగం సినిమాలో విషయం ఇదే. మరి ఎన్టీఆర్‌ను వర్మ అనేవాడు ఎప్పుడూ  కలవనపుడు.. ఆ ఇద్దరి మధ్య జరిగిన విషయాల్ని వర్మకు ఎవరు చెప్పినట్లు? తాను సినిమాలో చూపించిందంతా నూటికి నూరు శాతం అని వర్మ అంటున్నపుడు.. లక్ష్మీపార్వతిని కలిసి ఇన్ పుట్స్ తీసుకోకుండా ఎలా ఈ సన్నివేశాలన్నీ తీసినట్లు? దీన్ని బట్టే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయంలో వర్మ నిజాయితీ, సిన్సియారిటీ ఎంతో తెలిసిపోతుంది కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English