సైరాలో రెండు సీన్లే..

సైరాలో రెండు సీన్లే..

మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ చిత్రంలో నిహారిక నటిస్తోందంటే అది రూమరే అనుకున్నారు. కానీ ఆ వార్త నిజమే అని తర్వాత తెలిసింది. నిహారిక ఈ చిత్రంలో నటిస్తుండగా ఆన్ లొకేషన్ పిక్ కూడా బయటికి వచ్చింది. నిహారిక సైతం ‘సైరా’ నటిస్తున్నట్లు ధ్రువీకరించింది.

ఐతే అందులో నిహారిక స్క్రీన్ టైం చాలా చాలా తక్కువట. ఆమె కనిపించేది రెండే రెండు సన్నివేశాల్లోనట. ఈ విషయాన్ని స్వయంగా నిహారికే వెల్లడించింది. మెగాస్టార్ సినిమాలో నటించాలని కలలు కన్నానని.. కాబట్టి అందులో ఒక్క నిమిషం కనిపించినా తనకు బాధేమీ లేదని.. అందుకే రెండు సీన్ల పాత్రకు కూడా ఓకే చెప్పానని నిహారిక వెల్లడించింది. అందులో ఒక సన్నివేశం చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. అందులో తన నటనకు ప్రశంసలు దక్కుతాయని ఆశిస్తున్నానని నిహారిక చెప్పింది.

నిహారిక కొత్త సినిమా ‘సూర్యకాంతం’ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కచ్చితంగా విజయవంతం అవుతుందని నిహారిక ధీమా వ్యక్తం చేసింది. తన పాత్రలో కాన్‌ఫ్లిక్టే సినిమాకు ప్రధాన ఆకర్షణ అని ఆమె అంది. తన తొలి రెండు సినిమాల ఫెయిల్యూర్లపై నిహారిక మాట్లాడింది. ‘‘ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌ రెండూ మంచి కథలే. కానీ ఫలితాలే నిరాశ పరిచాయి. విడుదల తేదీ, తదితర కారణాల వల్ల ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ‘సూర్యకాంతం’ మాత్రం మంచి సమయంలో విడుదల చేస్తున్నాం. వేసవి సెలవలు వచ్చాయి కదా? ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తారన్న నమ్మకం ఉంది’’ అని నిహారిక చెప్పింది.

భవిష్యత్తులో సినిమాల్లో కొనసాగుతారా లేదా అన్న ప్రశ్నకు నిహారిక సూటిగా సమాధానం ఇవ్వలేదు. తనకు ప్రొడక్షన్ మీద, వెబ్ సిరీస్‌ల మీద ఆసక్తి ఉందని చెప్పడం ద్వారా మున్ముందు కథానాయికగా కొనసాగడం సందేహమే అని చెప్పకనే చెప్పింది నిహారిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English