కాంఛన సిరీస్‌లో 10 సినిమాలు

కాంఛన సిరీస్‌లో 10 సినిమాలు

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా కొనసాగుతున్న రాఘవ లారెన్స్ డైరెక్షన్ అన్నపుడు అందరూ వింతగా చూశారు. అతడికంత సీనుందా అనుకున్నారు. కానీ అక్కినేని నాగార్జున అంతటి వాడు లారెన్స్‌ను నమ్మి అవకాశమిస్తే.. ‘మాస్’తో సూపర్ హిట్ అందించాడు. ఆ తర్వాత లారెన్స్ నుంచి వచ్చిన సినిమాలు అంతగా ఆడలేదు కానీ.. ‘కాంఛన’ సిరీస్‌తో అతను దర్శకుడిగా మళ్లీ తన సత్తా చూపించాడు.

ఈ సిరీస్ చిత్రాలు అందరినీ ఆకట్టుకోవు కానీ.. మాస్ ప్రేక్షకులకు మాత్రం అవి కావాల్సినంత వినోదాన్నందిస్తాయి. ‘కాంఛన’తో పాటు ‘గంగ’ సైతం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సిరీస్‌లో కొత్త సినిమా ‘కాంఛన-3’ విడుదలకు సిద్ధమవుతోంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ ‘కాంఛన’ సిరీస్ అభిమానుల్ని ఆకట్టుకుంది. లారెన్స్ మళ్లీ వసూళ్ల మోత మోగించేలాగే కనిపిస్తున్నాడు. ఐతే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఇవే సినిమాలు తీసుకుంటూ పోతే జనాలకు మొహం మొత్తే ప్రమాదమూ లేకపోలేదు.

‘ముని’తో మొదలుపెడితే ఈ హార్రర్ కామెడీ సిరీస్‌లో ఇప్పుడొస్తున్నది నాలుగో సినిమా. జనాలైతే ఇక చాలు లారెన్స్ అంటున్నారు. కానీ అతను మాత్రం ఈ సిరీస్‌లో పది సినిమాలు తీయాలని ఆశపడుతుండటం విశేషం. ‘ముని’ మొదలుు పెట్టినపుడు ఈ సిరీస్‌లో ఇన్ని సీక్వెల్స్ తీస్తానని అనుకోలేదని.. దక్షిణాదిన ఏ సినిమాకూ ఇన్ని సీక్వెల్స్ రాలేదని అన్నాడు లారెన్స్.

‘కాంఛన-3’ తీస్తానని కూడా తాను అనుకోలేదని.. కానీ తన ఇష్టదైవం రాఘవేంద్రస్వామి అనుగ్రహంతో అలా జరిగిపోయిందని... కాబట్టి తర్వాతి సీక్వెల్ కూడా అనుకోకుండానే మొదలు కావచ్చని.. దేవుడి అనుగ్రహం ఉంటే ‘కాంఛన’ సిరీస్‌లో పదో సినిమా కూడా రావచ్చని లారెన్స్ చెప్పాడు. లారెన్స్ తమాషాకు అన్నాడో.. సీరియస్‌‌గానో కానీ.. ప్రపంచంలో ఇప్పటిదాకా ఒక సిరీస్‌లో పది సినిమాలు రావడం ‘జేమ్స్ బాండ్’ విషయంలో మాత్రమే జరిగింది. కానీ అందులో హీరో క్యారెక్టర్‌ కాకుండా మిగతా అంతా ప్రతి సినిమాలోనూ కొత్తగా ఉంటుంది. కానీ లారెన్స్ వ్యవహారం అలా కాదు కదా. కాబట్టి ఈ సిరీస్‌లో పది సినిమాలంటే అంతే సంగతులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English