మిమ్మ‌ల్ని వ‌దులుకోం.. జ‌గ‌న్‌కు షా హామీ..

“మిమ్మ‌ల్ని మేం వ‌దులుకోం! మీ స‌మ‌స్య‌లు మీవి కాదు.. మావి!” .. ఈ మాట అన్న‌ది ఎవ‌రో కాదు.. కేంద్ర హోం శాఖ మంత్రి, కేంద్రంలో నెంబ‌ర్ 2 నాయ‌కుడు.. అమిత్ షా. అది కూడా ఎవ‌రి గురించో కాదు.. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గురించే. ప్ర‌స్తుతం తిరుప‌తి కేంద్రంగా జ‌రిగిన ద‌క్షిణ ప్రాంతీయ మండ‌లి స‌మావేశం ముగిసింది. అయితే.. ఈ స‌మావేశానికి సీఎం హోదాలో.. జ‌గ‌న్ నాయ‌క‌త్వం వ‌హించారు. మండ‌లి స‌మావేశానికి చైర్మ‌న్‌గా.. అమిత్ షానే ఉన్నా.. సీఎం హోదాలో జ‌గ‌న్ నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. తొలి ప్ర‌సంగం కూడా ఆయ‌నే చేశారు.

అయితే.. దీనికి ముందే.. షా.. రాష్ట్రంలో అడుగు పెట్టిన నాటి నుంచి చివ‌రి నిముషం వ‌ర‌కు కూడా సీఎం.. జ‌గ‌న్ అన్నీతానై, ఆయ‌న‌కు అతిధి మ‌ర్యాదలు చేశారు. ఈ క్ర‌మంలో అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ.. రాష్ట్ర స‌మ‌స్య‌లు వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా.. ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం.. రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాల‌ను జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్‌తో ప‌ర్స‌న‌ల్‌గా మాట్లాడిన‌(స‌మావేశానికి ముందు 5 నిముషాలు) షా.. జ‌గ‌న్‌కు అభ‌యం ఇచ్చార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అనంత‌రం.. స‌మావేశంలో మాట్లాడిన షా.. మ‌రోసారి.. జ‌గ‌న్ విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. అంతేకాదు.. జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని.. తప్పకుండా వీటన్నింటికీ పరిష్కారం చూపుతామని ఈ సభాముఖంగా అమిత్‌ షా హామీ ఇచ్చారు. ఇక‌, ర‌హ‌స్యంగా మాట్లాడిన రెండు మూడు నిమిషాల్లోనూ.. జ‌గ‌న్ త‌మ‌కు అత్యంత కావాల్సిన నాయ‌కుడ ని.. యువ‌త‌ను ప్రోత్స‌హించేందుకు .. మోడీ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ విష‌యంలో మోడీ సానుకూలంగా ఉన్నార‌ని.. కూడా షా .. స్వ‌యంగా జ‌గ‌న్ చెప్పార‌ని తెలుస్తోంది.

“మీరు మా మ‌నిషి” అని జ‌గ‌న్‌తో షా అన్నార‌ని తెలిసింది. ఇక‌, ఈ స‌మావేశంలో జ‌గ‌న్‌.. రాష్ట్రానికి సంబంధించి.. అనేక అంశాల‌ను ప్ర‌స్తావించారు. ‘ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి.. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలుకాలేదు” అని జ‌గ‌న్ వివ‌రించారు.

అంతేకాదు.. “ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే. రీసోర్స్‌ గ్యాప్‌నూ భర్తీ చేయలేదు. తెలంగాణ నుంచి విద్యుత్‌ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు. దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్‌ లబ్ధిదారుల గుర్తింపుపై కేంద్రం ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీనిపై వెంటనే సవరణలు చేయాలి’ అని సమావేశంలో కీలక అంశాలను జగన్‌ ప్రస్తావించారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు షా.. మొగ్గు చూప‌డం విశేషం.