‘ఆర్ఆర్ఆర్’లో ఆ ఇద్దరు కూడా..

‘ఆర్ఆర్ఆర్’లో ఆ ఇద్దరు కూడా..

‘బాహుబలి’ సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళిపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. తన ప్రతి సినిమాకూ ఇలా పెరుగుతూ పోయే అంచనాల్ని అందుకోవడానికి మరింతగా కష్టపడతాడు జక్కన్న. ‘బాహుబలి’ తర్వాత ఈ అంచనాలు మరీ ఎక్కువైపోయాయి. ఆకాశాన్నంటుతున్నాయి. అయినా కూడా ఎప్పట్లాగే కష్టపడి వాటిని అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు జక్కన్న. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న ఓ మోస్తరు స్థాయి సినిమాలు చేయడం కష్టమే. ఇక ప్రతిదీ భారీగా ఉండాల్సిందే. ఇప్పుడాయన తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ వ్యవహారం చూస్తే ‘బాహుబలి’ రేంజికి ఏమాత్రం తగ్గేలా లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సముద్రఖని, ఆలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్.. లాంటి బహు భాషా తారాగణం ఉంది.

ఐతే ఈ భారీతనం అంతటితో ఆగట్లేదు. ఇందులో మరో ఇద్దరు పెద్ద బాలీవుడ్ స్టార్లు నటిస్తారని తాజా సమాచారం. ఆ ఇద్దరు మరోవరో కాదు.. సీనియర్ హీరో సంజయ్ దత్, యువ కథానాయకుడు వరుణ్ ధావన్. వీళ్లిద్దరి కోసం కూడా సినిమాలో బలమైన పాత్రలు తీర్చిదిద్దాడట జక్కన్న. ‘బాహుబలి’ లాగా హిందీలో ‘ఆర్ఆర్ఆర్’కు క్రేజ్ తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. ‘బాహుబలి’కి అనుకోకుండా కలిసొచ్చింది కానీ.. ఈసారి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగాల్సిందే. అందుకే ప్రముఖ బాలీవుడ్ తారల్ని సినిమాలో భాగం చేస్తున్నారు. సంజయ్ దత్, వరుణ్ ధావన్‌ల విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని అంటున్నారు. అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య రూ.350 కోట్లకు పైగా బడ్జెట్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English