కేసీఆర్ మీద ఇలా తీసే దమ్ముందా?

కేసీఆర్ మీద ఇలా తీసే దమ్ముందా?

రామ్ గోపాల్ వర్మ తాను ఎవరికీ భయపడనంటాడు. ఏం అనుకుంటే అది మాట్లాడగలనంటాడు. ఎవరిమీదైనా.. ఎలాగైనా సినిమా తీయగలనని అంటాడు. ఆయన మద్దతుదారులు కూడా వర్మను ‘మగాడు’గా అభివర్ణిస్తుంటారు. ఐతే వర్మ ఏదైనా సెలెక్టివ్‌గా చేస్తాడనే విషయం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీ జనాలు ఎంత గుంభనంగా ఉంటున్నారో తెలిసిందే.

కేసీఆర్ సర్కారు తప్పులే చేయట్లేదనేమీ లేదు. విమర్శించడానికి చాలా అంశాలున్నాయి. సినీ రంగం నుంచే వెళ్లిన పవన్ మీద రాళ్లేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరునూ దుయ్యబట్టేస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్‌ను కానీ, మిగతా తెలంగాణ నాయకుల్ని కానీ ఒక మాట అనే దమ్ము ఎవ్వరికీ లేదు. వాళ్లేదైనా తప్పు చేసినా వీళ్లు కిక్కురుమనకుండా ఉంటారు. వర్మ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. మిగతా వాళ్ల గురించి ఎలా పడితే అలా మాట్లాడే వర్మ కేసీఆర్ విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు.

సినిమాల విషయానికి వస్తే.. తరచుగా అతను వివాదాలతో ముడిపడ్డ నిజ జీవిత కథల్ని ఎంచుకుంటుంటాడు. ఇప్పుడు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా ఆ కోవలోనిదే. వైఎస్సార్ కాంగ్రెస్ అండతో ఈ సినిమా తీస్తున్న వర్మ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఎలా టార్గెట్ చేశాడో తెలిసిందే. చంద్రబాబు వ్యవహార శైలి ఏంటో తెలుసు కాబట్టే ధైర్యంగా వర్మ ఈ పని చేయగలిగాడు. అదే.. కేసీఆర్ మీద వర్మ ఇలాంటి సినిమా తీయగలడా? గతంలోనే వర్మ ఒకసారి కేసీఆర్‌పై ఓ చిత్రం అనౌన్స్ చేశాడు.

ఈ మధ్య దాని గురించి అడిగితే.. భవిష్యత్తులో ఆ సినిమా కూడా తీస్తానంటున్నాడు. మరి కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో తప్పిదాలే లేవా? మరి వాటన్నింటి మీదా వర్మ నిజాయితీగా తన సినిమాలో చర్చించే అవకాశముందా? చంద్రబాబును బ్లేమ్ చేసినట్లే కేసీఆర్‌ను బ్లేమ్ చేయగలడా? మాటకు ముందు తన దమ్ము గురించి, తెగింపు గురించి మాట్లాడే వర్మ.. కేసీఆర్ మీద వాస్తవాలకు దగ్గరగా సినిమా తీస్తే అప్పుడు అందరూ ఆయన్ని నిజమైన ‘మగాడు’గా అభివర్ణించవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English