తేజు అమెరికా వెళ్లింది అందుకట..

తేజు అమెరికా వెళ్లింది అందుకట..

సినిమా హీరోగా కొనసాగుతున్నపుడు ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తిండి తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలి. మంచి బాడీ మెయింటైన్ చేస్తూ సాగాలి. ఏ చిన్న తేడా వచ్చినా జనాల ఫీలింగ్ మారిపోతుంది. లుక్ మారితే సెటైర్లు పడిపోతాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ్.. ఒక దశ వరకు మంచి ఫిజిక్కే మెయింటైన్ చేశాడు. చిజిల్ బాడీతో కనిపించాడు. కానీ గత రెండేళ్లుగా అతనేమంత ఫిట్‌గా కనిపించడం లేదు. బరువు పెరిగాడు. బొద్దుగా తయారయ్యాడు. ఓవైపు వరుసగా అతడి సినిమాలు ఫ్లాపవుతుంటే.. దీనికి తోడు ఫిజిక్ కూడా తేడాగా తయారవడంతో అతడిపై చాలా సెటైర్లు పడ్డాయి.

ఇలాంటి సమయంలోనే గత ఏడాది తేజు అమెరికాకు వెళ్లాడు. అతను లైపో చేయించుకుని బరువు తగ్గడానికే యుఎస్ వెళ్లాడని గుసగుసలు వినిపించాయి. ఐతే తాను అప్పుడు అమెరికా వెళ్లిన కారణం వేరని.. తాను బరువు పెరగడానికి కూడా వేరే కారణాలున్నాయని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేజు చెప్పాడు. ‘‘నేను బరువు పెరగడానికి కారణం నా గాయాలే. ‘విన్నర్‌’ సినిమా సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు కింద పడి గాయాలయ్యాయి. పెద్దగా పట్టించుకోలేదు. ఆ నొప్పులతోనే ‘జవాన్‌’ సినిమాలో పరుగులు పెట్టేశాను. దాంతో గాయాలు మరింత పెద్దవయ్యాయి.

వరుసగా సినిమాలు చేయడంతో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులే ఎదుయ్యాయి. ఓ దశలో కాలు కూడా కదపలేకపోయా. నొప్పిని భరిస్తూ.. పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుంటూ డాన్సులు చేశా. అమ్మ దగ్గర ఈ విషయం బయటపడకుండా మేనేజ్ చేసేవాడిని. అయినా ఆమె కనిపెట్టేసింది. ఆమె భయపడటంతో ఇక లాభం లేదనుకొని చికిత్స కోసం అమెరికా వెళ్లా. నేను లైపో చేయించుకోవడానికి వెళ్లానని చాలామంది అనుకున్నారు. హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ కోసమని కూడా రూమర్లు పుట్టించారు. కానీ నేను ఆర్థో ఫిజీషియన్‌ కోసం అమెరికా వెళ్లా. అక్కడికెళ్లొచ్చాకే రిలీఫ్ వచ్చింది. తర్వాత బరువు తగ్గుతూ వస్తున్నా’’ అని తేజు చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English