ఎప్పుడూ నీచమైన కామెంట్లే.. ఎలా భరిస్తున్నారబ్బా?

ఎప్పుడూ నీచమైన కామెంట్లే.. ఎలా భరిస్తున్నారబ్బా?

తమిళ సినీ పరిశ్రమలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో రాధా రవి ఒకరు. ఆయన ఏదైనా వేదిక ఎక్కాడంటే ఏదో ఒక వివాదం రాజుకోవాల్సిందే. బాగా నోటి దురుసు ఉన్న రాధారవి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. ముఖ్యంగా మహిళల్ని కించపరిచేలా పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాడు. ‘మీ టూ’ మూమెంట్‌ను, మహిళలపై లైంగిక వేధింపులపై పోరాడుతున్న చిన్మయిని కూడా కించపరుస్తూ మాట్లాడాడు రాధారవి. అయినా తమిళ సినీ పరిశ్రమ పెద్దలు ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో రాధారవి మరోసారి రెచ్చిపోయాడు. తాజా స్టార్ హీరోయిన్ నయనతారను ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశాడాయన.

నయనతార నటించిన ‘కోలైయుదిర్ కాలం’ అనే సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో రాధారవి మాట్లాడుతూ.. నయనతార చాలా వైవిధ్యమైన నటి అని.. తమిళంలో ఓవైపు దెయ్యం పాత్ర చేస్తుందని.. మరోవైపు ఇంకో భాషలో సీత పాత్ర చేస్తుందని (శ్రీరామరాజ్యం సినిమానుద్దేశించి) అన్నాడు రాధారవి. ఐతే ఒకప్పుడు దేవుడి పాత్ర చేయాలంటే కేఆర్ విజయ లాంటి వాళ్ల వైపు చూసేవారని.. కానీ ఇప్పుడు ఎవరైనా ఆ పాత్ర చేసేస్తున్నారని చెప్పాడు రాధారవి. అంతటితో ఆగకుండా ‘ఒకప్పుడు మనిషిని చూస్తే దండం పెట్టాలనిపించే వాళ్లు దేవుడి పాత్ర వేసేవాళ్లు. కానీ ఇప్పుడు మనిషిని చూడగానే వస్తావా అని అడగాలనిపించేవాళ్లు దేవుడి పాత్ర చేస్తున్నారు’ అని రాధారవి అన్నాడు.

నేరుగా నయన్ పేరెత్తకపోయినా.. ఆమెను ఉద్దేశించే ‘చూడగానే వస్తావా అనాలనిపించే’ కామెంట్ రాధారవి చేశాడన్నది స్పష్టం. దీనిపై తీవ్ర దుమారం రేగింది. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ సహా పలువురు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఐతే ఈ వేడుకలో నయన్ పాల్గొనలేదు. ఆమె తన సినిమాల ప్రమోషన్లకు రాదన్న సంగతి తెలిసిందే. రాధారవి వ్యాఖ్యల మీద కూడా ఆమె స్పందించలేదు. నయన్‌ను కించపరిచేలా మాట్లాడటమే కాక మరో వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశాడు రాధా రవి. చిన్న సినిమా అంటే ఒకరిని రేప్ చేయడం లాంటిదని.. పెద్ద సినిమా అంటే పొల్లాచ్చిలో మాదిరి ఒకరు ఒకేసారి 40 మందిని రేప్ చేయడం లాంటిదంటూ దారుణమైన కామెంట్ చేశాడు రాధారవి. ఈ వ్యాఖ్యలు మనకు షాకింగ్‌గా అనిపిస్తాయి కానీ.. రాధారవి తీరు తెలిసిన తమిళ జనాలకు మామూలే. మళ్లీ మళ్లీ చెత్త వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అలాంటి వ్యక్తిని ఎలా మన్నించి వదిలిపెడుతున్నారన్నది అర్థం కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English