‘యన్.టి.ఆర్’ ముంచింది.. ‘తలైవి’ ఏం చేస్తుందో?

‘యన్.టి.ఆర్’ ముంచింది.. ‘తలైవి’ ఏం చేస్తుందో?

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ద్వారా ఫేమస్ అయిన విష్ణు ఇందూరి.. నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా ‘యన్.టి.ఆర్’ సినిమా చేశాడు. ఐతే ఈ సినిమాకు ముందుగా శ్రీకారం చుట్టింది విష్ణునే కానీ.. ఆ తర్వాత కథ మారిపోయింది. సాయి కొర్రపాటి కలిశాడు. ఆపై బాలకృష్ణ కూడా నిర్మాణ భాగస్వామిగా మారాడు. చివరగా మిగతా ఇద్దరినీ పక్కకు నెట్టి బాలయ్యే ప్రధాన నిర్మాతగా మారాడు. విష్ణు డమ్మీ అయిపోయాడు. ఇక ‘యన్.టి.ఆర్’ సినిమా ఫలితం గురించి చెప్పాల్సిన పని లేదు. దీని వల్ల విష్ణుకు పేరూ రాలేదు. డబ్బూ రాలేదు. ఐతే విష్ణు ఇటు తమిళంలో, అటు హిందీలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. అవి రెండూ కూడా బయోపిక్‌లే. హిందీలో కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ‘83’ సినిమాను మరో సంస్థతో కలిసి నిర్మిస్తున్న విష్ణు.. తమిళంలో జయలలిత బయోపిక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అతనొక్కడే నిర్మాత.

ఒక రకంగా చెప్పాలంటే విష్ణు పూర్తి స్థాయి నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి ‘తలైవి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘నాన్న’ సినిమా ఫేమ్ ఎ.ఎల్.విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘తలైవి’కి రాజమౌళి తండ్రి, ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ సపోర్ట్ ఇస్తుండటం విశేషం. దీని స్క్రిప్ట్, మేకింగ్ ఆయన పర్యవేక్షణలోనే జరుగుతోంది. ముందు విద్యాబాలన్‌ను జయ పాత్ర కోసం తీసుకున్నారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. ఆమెను కాదని ఇప్పుడు కంగనా రనౌత్‌ను లీడ్ రోల్‌కు ఎంపిక చేశారు. బాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న కంగనా తొలిసారి దక్షిణాదిన సినిమా చేస్తుండటం ఆసక్తి రేకెత్తించేదే. కాంబినేషన్‌ క్రేజ్‌కు తగ్గట్లే భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించనున్నాడు విష్ణు. తమిళంలో జయ మీద ఇంకో రెండు సినిమా, ఓ వెబ్ సిరీస్ వస్తున్నప్పటికీ వాటితో పోలిస్తే ‘తలైవి’కే క్రేజ్ ఎక్కువుంది. మరి ఈ సినిమాతో అయినా అతను మంచి ఫలితాన్నందుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English