నాగబాబు బాగానే సంపాదించాడబ్బా..

నాగబాబు బాగానే సంపాదించాడబ్బా..

మెగా బ్రదర్ నాగబాబు ఒక సమయంలో ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడాలన్న ఆలోచనకు వచ్చిన సంగతి స్వయంగా ఆయనే వెల్లడించాడు. 'ఆరెంజ్' సినిమాతో అప్పుల పాలై.. తన కారు అమ్మేసి, తన స్థాయికి తగని చిన్న అద్దె ఇంటికి నాగబాబు మారడమూ తెలిసిందే. ఆ స్థితిలో పవన్ కళ్యాణ్ నాగబాబును ఆదుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆర్థికంగా అంత ఇబ్బందికర స్థితికి చేరిన నాగబాబు.. తర్వాత బాగానే కోలుకున్నాడు.

ఓవైపు 'జబర్దస్త్' కామెడీ షో.. మరోవైపు సీరియళ్లు, సినిమాలు చేయడంతో నాగబాబు ఆర్థికంగా కుదురుకున్నాడు. ఆయన తనయుడు వరుణ్ తేజ్ సైతం హీరోగా నిలదొక్కుకోవడంతో నాగబాబు ఆర్థిక స్థితి ఎంతో మెరుగైంది. ఇప్పుడు ఆయన ఆస్తులు రూ.40 కోట్లు దాటడం విశేషం. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ తరఫున నాగబాబు ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో నాగబాబు తన ఆస్తుల వివరాలు ప్రకటించాడు. తనకు రూ.41 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులున్నట్లు పేర్కొన్నాడు. రూ.2 కోట్లకు పైగా అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించాడు. అఫిడవిట్లో రూ.41 కోట్లుగా పేర్కొన్నాడంటే.. వాటి వాస్తవ విలువ చాలానే ఉండొచ్చు. మొత్తానికి 'ఆరెంజ్' సినిమా సమయానికి 'జీరో' మైనస్సుల్లో ఉన్న నాగబాబు.. ఈ పదేళ్లలో గొప్ప వృద్ధి సాధించినట్లే.

ఆర్థికంగా చితికిపోయిన సమయంలో తన స్థాయి గురించి ఆలోచించకుండా నాగబాబు సీరియళ్లలో కూడా నటించాడు. 'జబర్దస్త్' లాంటి కామెడీ షో సైతం ఆయన స్థాయికి తక్కువే. కానీ బేషజం ఏమీ లేకుండా దీంతో  కూడా పాల్గొన్నాడు. సినిమాల్లో సైతం చిన్న స్థాయి పాత్రలు చేయడానికి ముందుకొచ్చాడు. ఈ చిన్న చిన్న అవకాశాలే మళ్లీ నాగబాబును నిలబెట్టాయి. సమయానికి కొడుకు కూడా కలిసి రావడంతో నాగబాబు మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఎంపీగా గెలిస్తే నాగబాబు దశ తిరిగిపోతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English