అల్లువారితో పని కాలా.. ఇక నందమూరి వారితో

అల్లువారితో పని కాలా.. ఇక నందమూరి వారితో

‘శ్రీరస్తు శుభమస్తు’తో కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్న తర్వాత అల్లు శిరీష్ భారీ బడ్జెట్లో ఒక పీరియడ్ మూవీ చేయడానికి సన్నాహాలు చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ‘ఢీ’ సినిమాను నిర్మించిన మల్లిడి సత్యానారాయణ అనే నిర్మాత కొడుకైన మల్లిడి వేణు ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావాల్సింది. కొంచెం పెద్ద స్థాయిలోనే ఆ సినిమా చేయాలనుకున్నారు.

ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. కానీ ఆ సినిమా చేయడం రిస్క్ అని భావించి శిరీష్ చివరి నిమిషంలో తప్పుకున్నాడు. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ మల్లిడి వేణు తర్వాత ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. ఐతే రెండేళ్లకు పైగా విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ అతడి పేరు వినిపిస్తోంది. అల్లు కాంపౌండ్ నుంచి బయటికి వచ్చాక అతను నందమూరి కాంపౌండ్లోకి ఎంటరవుతుండటం విశేషం.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాకు మల్లిడి వేణునే దర్శకత్వం వహించనున్నాడట. ఈ చిత్రానికి ‘తుగ్లక్’ అనే వెరైటీ టైటిల్ పెడుతుండటం విశేషం. ఇదొక సోషియో ఫాంటసీ మూవీ అట. కొంత కాలంగా బయటి బేనర్లలో సినిమాలు చేస్తున్న కళ్యాణ్.. ఈసారి మాత్రం తన సొంత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్లోనే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. దీనికి బడ్జెట్ కొంచెం ఎక్కువే అవుతుందని సమాచారం.

మరి మల్లిడి వేణు.. శిరీష్ కోసం చెప్పిన కథలోనే ఏమైనా మార్పులు చేసి ఈ సినిమా తీస్తున్నాడా.. కొత్త కథ ట్రై చేస్తున్నాడా అన్నది తెలియదు. కళ్యాణ్ రామ్ ఇప్పటిదాకా చాలామంది కొత్త దర్శకులకు అవకాశమిచ్చాడు. అతడి కెరీర్లో రెండు పెద్ద హిట్లుగా నిలిచిన ‘అతనొక్కడే’.. ‘పటాస్’ కొత్త దర్శకులు రూపొందించినవే. మరి ఈసారి కొత్త దర్శకుడితో అతను ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English