అవార్డుల వేదికపై ఏడడుగులు వేశారు

అవార్డుల వేదికపై ఏడడుగులు వేశారు

చాలా ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఆ పెళ్లి వేడుకకు బాలీవుడ్ నుంచి ప్రముఖులెవ్వరినీ పిలవలేదు. గతేడాది ఇటలీలోని లేక్‌ కోమోలో ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యుల మధ్య చాలా సింపుల్‌గా పెళ్లి చేసేసుకున్నారు. వీరి పెళ్లి చూసే భాగ్యం బాలీవుడ్ సెలబ్రెటీలకు దక్కలేదు.

ఐతే అప్పుడు అందరూ మిస్సయ్యారు కాబట్టి.. ఇప్పుడు మరోసారి మీరు ఏడడుగులు నడిచి అందరికీ మీ పెళ్లి వేడుకను చూసే భాగ్యం కల్పించండి అంటూ వీళ్లిద్దరికీ తాజాగా ఒక అవార్డుల వేడుకలో ప్రపోజల్ వచ్చింది. ఇద్దరూ అల్లరి వాళ్లే కావడం.. అందులోనూ రణ్వీర్ సింగ్ ఇలాంటి వేడుకలో చేసే తమాషాలు ఎలా ఉంటాయో తెలిసిందే కదా? మంగళవారం రాత్రి ముంబయిలో ఓ అవార్డుల వేడుకలో వీళ్లిద్దరూ సరదాగా ఏడడుగులు వేసి అందరినీ అలరించారు.

ఈ షోకు బాలీవుడ్‌ యువ నటులు విక్కీ కౌశల్‌, కార్తీక్‌ ఆర్యన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. వేడుకలో దీపిక, రణ్‌వీర్‌లు అవార్డులు అందుకోవడానికి స్టేజ్‌పైకి వెళ్లారు. ఈ నేపథ్యంలో పెళ్లికి తమను పిలవలేదని.. వేడుక ఎలా జరిగిందో తాము చూడలేదు కాబట్టి మరోసారి తమ అందరి ముందు ఏడడుగులు వేయాల్సిందేనని విక్కీ, కార్తీక్‌ పట్టుబట్టారు. ఇందుకు రణ్వీర్-దీపిక కూడా ఒప్పుకొన్నారు. విక్కీ పురోహితుడిగా నేలపై కూర్చుని నోటికొచ్చిన మంత్రాలు చదువుతుంటే.. దీపిక వేసుకున్న డ్రెస్ చున్నీ పట్టుకుని రణ్వీర్ ఏడడుగులు వేశాడు.

చాలా సరదాగా సాగిపోయిన ఈ తంతుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో రణ్వీర్-దీపిక చేసిన తమాషా చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఎంతైనా దీపిక-రణ్వీర్ కెమిస్ట్రీనే వేరని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English