పేరు మారింది.. హిట్టొస్తుందా?

పేరు మారింది.. హిట్టొస్తుందా?

సినీ రంగంలో ఉన్నంత దారుణమైన సక్సెస్ రేట్ మరెక్కడా ఉండదు. ఏడాదిలో వచ్చే సినిమాల్లో పది శాతం హిట్టయినా గొప్ప అనే పరిస్థితి ఉంటుందిక్కడ. అయినా కూడా ఈ ఫీల్డుకి ఉన్న ఆకర్షణ దృష్ట్యా సినిమాలు ఆగవు. ఎవ్వరూ ఇండస్ట్రీని వదిలి వెళ్లడానికి ఇష్టపడరు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. హిట్టు కోసం ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టరు.

ఈ క్రమంలో చాలామంది సెంటిమెంట్లను కూడా ఫాలో అవుతుంటారు. సినిమాల్లోకి వచ్చాక పేర్లను మార్చుకోవడం ఇక్కడ సర్వ సాధారణమైన విషయం. పూర్తిగా పేరు మార్చుకునేవాళ్లు కొందరైతే.. ఉన్న పేర్లలో మార్పులు చేసుకునేవాళ్లు కొందరు. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. రెండో బాటనే అనుసరిస్తున్నాడు. తన పేరులోంచి ‘ధరమ్’ తీసేశాడు సుప్రీమ్ హీరో.

తేజు నటిస్తున్న కొత్త సినిమా ‘చిత్రలహరి’లోంచి నిన్న ‘పరుగు పరుగు’ అంటూ సాగే తొలి పాట లాంచ్ అయింది. దీనికి సంబంధిచిన లిరికల్ వీడియోలో తేజు పేరు ‘సాయి తేజ్’గా పడింది. తేజ్ పదం పైన కిరీటం కూడా పెట్టారు. దాని ఉద్దేశమేంటో తెలియదు మరి. తేజు పేరు అయితే.. ‘సాయిధరమ్ తేజ్’ నుంచి ‘సాయి తేజ్’గా మారిందన్నది మాత్రం స్పష్టం.

కెరీర్ ఆరంభంలో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన తేజు.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడతడికి హిట్టు చాలా చాలా అవసరం. ఆ ఆశ ‘చిత్రలహరి’తో నెరవేరుతుందని తేజు భావిస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ సైతం తమ పేర్లను మార్చుకున్నవాళ్లే. ముందు పవన్ కళ్యాణ్ పేరు కళ్యాణ్ బాబు కాగా.. అది ‘పవన్ కళ్యాణ్’ అయింది. ఇక రామ్ చరణ్ తేజ్ తన పేరులోంచి ‘తేజ్’ తీసేసిన సంగతి తెలిసిందే. మరి పేరు మార్పు కలిసొచ్చి తేజుకి హిట్టొస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English