భారతీయుడు-2.. కదలడం కష్టమే

భారతీయుడు-2.. కదలడం కష్టమే

దక్షిణాది సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప.. అతి పెద్ద హిట్ చిత్రాల్లో ‘భారతీయుడు’ ఒకటి. 90ల చివర్లో వచ్చిన ఈ చిత్రం  అప్పట్లో చారిత్రక విజయం సాధించింది. దీనికి సీక్వెల్ తీయాలని దర్శకుడు శంకర్ ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాడు. కానీ ఎప్పటికప్పుడు ఏవో ఇబ్బందులు వచ్చాయి. చివరికి గత ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది.

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమల్ హాసన్.. చివరగా ఈ చిత్రం చేసి సినిమాలకు టాటా చెప్పేయాలని అనుకున్నాడు. కానీ ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలుపెట్టారో కానీ.. ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. సినిమా చిత్రీకరణ మొదలైన కొన్ని రోజులకే బ్రేక్ పడింది. దీని బడ్జెట్ హద్దులు దాటి పోతుండటంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్సే షూటింగ్‌కి బ్రేక్ వేసినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు కమల్ హాసన్ లోక్ సభ ఎన్నికల కోసం సిద్ధమవుతుండటం వల్ల కూడా షూటింగ్ ముందుకు కదలడం లేదన్నారు.

ఐతే ఈ సినిమాకు బ్రేక్ పడటానికి కొత్తగా మరో కారణం వినిపిస్తోంది. ‘భారతీయుడు’కు హైలైట్‌గా నిలిచిన సేనాపతి పాత్రనే కమల్ ఇందులోనూ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన ప్రోస్తెటిక్ మేకప్ వేసుకోవాల్సి ఉంది. అప్పట్లో ఈ పాత్ర కోసం ఆయన వేసుకున్న మేకప్ జనాల్ని మెస్మరైజ్ చేసింది. గుర్తుపట్టలేని విధంగా కనిపించాడు కమల్. ఇప్పుడు మేకప్‌లో టెక్నాలజీ ఎంతో పెరిగింది. ఇప్పుడు మరింత గొప్పగా మేకప్‌తో ఆశ్చర్యపరుస్తారని భావించారు. కానీ ఇప్పుడు వేస్తున్న మేకప్ కమల్‌కు అస్సలు సెట్ కావడం లేదట.

తొలి షెడ్యూల్లో మేకప్ వేసిన సందర్భంగా కమల్‌కు అలర్జీ వచ్చిందట. చాలా ఇబ్బంది పడ్డారట. దీంతో షూటింగ్ ఆపి కొన్ని రోజుల విరామం తర్వాత మళ్లీ మేకప్ వేశారట. కమల్ మరోసారి అదే అలర్జీతో ఇబ్బంది పడటంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందట. రోజుకు ఐదారు గంటలు మేకప్ వేసుకుని షూటింగ్ చేయాల్సిన సినిమా ఇది. చిత్రంలో సేనాపతి పాత్రే కీలకం. అలాంటపుడు మేకప్ దగ్గర ఇబ్బంది అయితే సినిమా ముందుకు కదలడమే కష్టం. మరి కమల్‌కు మళ్లీ మళ్లీ ఇదే ఇబ్బంది ఎదురవుతున్నట్లయితే సినిమా ఎలా ముందుకు కదులుతుందో ఏమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English