పంచ్ ప్రభాకర్‌కు ఉచ్చు బిగిస్తున్న సీబీఐ


ఢిల్లీ: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన పంచ్‌ ప్రభాకర్‌కు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. పంచ్ ప్రభాకర్ అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది. పంచ్ ప్రభాకర్‌పై ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసు సీబీఐ జారీ చేసింది. పంచ్ ప్రభాకర్‌తో పాటు విదేశాల్లో ఉన్న మరో నిందితుడికి బ్లూ నోటీసులిచ్చారు. ఏపీ జడ్జీలపై, న్యాయాధికారులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరో ఐదుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, అజయ్ అమృత్‌లపై సీబీఐ విడివిడిగా చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ప్రభాకర్ ను పది రోజుల్లో అరెస్ట్ చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అరెస్టు చేయకపోతే విచారణ కోసం సీబీఐకి సంబంధంలేని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన విమర్శ ఎప్పుడూ ఆహ్వానించదగిందేనని హైకోర్టు గత విచారణ సందర్భంగా వ్యాఖ్యనించింది.

పంచ్ ప్రభాకర్ సోషల్ మీడియా ద్వారా భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు వరకూ వైసీపీని పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అసభ్యకరమైన పదజాలంతో దూషించేవారు. కులాలను తిట్లడం దగ్గర్నుంచి న్యాయవ్యవస్థ, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారిని కూడా వదిలి పెట్టలేదు. అందుకే ఆయన పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసి తీరాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇప్పటికే న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రభాకర్ ను గతంలో హైకోర్టు నోటీసులిచ్చింది. ఏమాత్రం లెక్క చేయకుండా సోషల్ మీడియాతో వీడియోలు అప్ లోడ్ చేస్తూ వచ్చారు. వైసీపీని ఎవరు వ్యతిరేకించినా బండ బూతులు తిడుతారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పేకర్ ఓం బిర్లాను కూడా అసభ్య పదజాలంతో దూషించేవారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు ప్రభాకర్ పై ఢిల్లీ పోలీసులు ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


యూట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులిచ్చారు. పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని పోలీసులు ఆదేశించారు.

ప్రవాసాంధ్రడైన ప్రభాకర్ అసలు పేరు చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. ఇతను నెల్లూరు జిల్లా వాసిగా చెబుతారు. వృత్తి రీత్యా వెటర్నీరీ డాక్టర్ అయిన ప్రభాకర్ అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటుంన్నాడు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రభాకర్ కీలకంగా వ్యవహరిస్తూ ఉండేవారని ప్రచారం జరిగింది. ఓ సారి కలాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ప్రభాకర్ కు వైసీపీకి సంబంధం లేదని ఆ పార్టీ ప్రకటించింది.