లక్ష్మీస్ ఎన్టీఆర్.. పోస్టర్ మారింది కానీ

లక్ష్మీస్ ఎన్టీఆర్.. పోస్టర్ మారింది కానీ

రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే మొదట చెప్పిన డేటుకి రిలీజ్ కావడం కష్టం. రిలీజ్ ముంగిట ఏవో వివాదాలు రావడం, ఇబ్బందులు తలెత్తడం, బిజినెస్ దగ్గర తేడా కొట్టడం, సెన్సార్ బోర్డు దగ్గర బ్రేక్ పడటం లాంటివి సాధారణం. ఆయన ప్రొడక్షన్లో వచ్చిన చివరి సినిమా ‘భైరవగీత’ ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే. ఇప్పుడు వర్మ కొత్త సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

గత నెలలోనే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి మార్చి 22కు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. కానీ సెన్సార్ సమస్యలతో ఆ డేట్ అందుకునే పరిస్థితి లేకపోయింది. కొన్ని రోజులుగా సెన్సార్ బోర్డుతో వర్మ టీం కయ్యం నడుస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఘర్షణ వాతావరణ నెలకొనగా.. తర్వాత వర్మే రాజీకి వచ్చి సాఫీగా పని ముగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం సెన్సారింగ్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎంత హడావుడిగా సెన్సార్ పూర్తి చేసినా.. 22న సినిమాను రిలీజ్ చేయడం కష్టమని తేలిపోయింది.

దీంతో రిలీజ్ డేట్ మార్చేశారు. ఎక్కువ ఆలస్యం చేయకుండా మార్చి 29నే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ప్రేక్షకుల ముందుకు తేవడానికి నిర్ణయించారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్‌తో పోస్టర్ కూడా రెడీ చేసేశాడు వర్మ. నిజాలు మార్చి 29న తెలుసుకోండంటూ ఈ అప్ డేట్ ఇచ్చాడు వర్మ. కానీ డేట్ మార్చి పోస్టర్ రెడీ చేసినంత ఈజీ కాదు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లాంటి వివాదస్పద సినిమాను రిలీజ్ చేయడం.

సెన్సార్ బోర్డు దగ్గర సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్లేమీ భావించడానికి వీల్లేదు. మరోవైపు ఎన్నికల సంఘం సినిమాకు బ్రేక్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం వర్గాలు కోర్టును కూడా ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో 29న కూడా సినిమా పక్కాగా రిలీజవుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. వచ్చే నెల 11న ఎన్నికలు జరిగే లోపు సినిమాను రిలీజ్ చేయగలిగితే మాత్రం వర్మ అండ్ టీమ్ గొప్ప విజయం సాధించినట్లే. కానీ అదంత తేలికైన వ్యవహారంలా మాత్రం కనిపించడం లేదు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English