పోసాని లాజిక్ కరెక్టే కదా?

పోసాని లాజిక్ కరెక్టే కదా?

పోసాని కృష్ణమురళిని సినీ పరిశ్రమలో ఫైర్ బ్రాండ్‌గా చెబుతారు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన తనకు నచ్చని విషయాల్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. ఎంతటి వాళ్లయినా చూడకుండా విమర్శలు చేస్తుంటారు. సినిమాలతో పాటు అప్పుడప్పడూ రాజకీయాల గురించి కూడా మాట్లాడే ఆయనకు.. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడంటే అస్సలు పడట్లేదు. ఆయన కొన్నేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌కు మద్దతుగా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఐతే పోసాని లాంటి వాళ్లను కెలికితే ఎంత ఇబ్బందో తెలిసి కూడా తెలుగుదేశం వాళ్లు ఆయనతో పెట్టుకున్నారు.

పోసాని తీస్తున్న ‘ముఖ్యమంత్రి గారూ మీరు మాటిచ్చారు’ అనే సినిమా మీద టీడీపీకి చెందిన మోహనరావు అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడట. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కించపరిచే ఈ చిత్రాన్ని అడ్డుకోవాలని కోరారట. దీంతో ఎన్నికల సంఘం దీనిపై వివరణ కోసం పోసానిని అమరావతికి రమ్మంది.

దీంతో పోసాని ప్రెస్ మీట్ పెట్టి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఎవరో ఊరూ పేరూ లేని వ్యక్తి తన సినిమా గురించి లేఖ రాస్తే తనను అమరావతికి పిలవడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. తాను తీస్తున్న సినిమా పేరు కూడా ఆ వ్యక్తిగా తప్పుగా పేర్కొన్నాడని.. ‘ముఖ్యమంత్రి గారు మాట తప్పాడు’ అనే పేరుతో తాను సినిమా తీస్తున్నట్లు చెప్పాడని.. అలాంటి ఫిర్యాదును పట్టుకుని తనను అమరావతికి పిలుస్తారా అని పోసాని అన్నాడు.

తాను తీసిన సినిమాలో ఏముందో ఎవరికీ తెలియదని.. అసలు తాను కూడా ఇంకా సినిమా చూసుకోలేదని.. మీడియా వాళ్లకు కూడా ఏ వివరాలూ చెప్పలేదని.. మరి సినిమా చూడకుండానే ఈ ఫిర్యాదును పట్టుకుని తన వివరణ ఎలా అడుగుతారని పోసాని ప్రశ్నించాడు. రేప్పొద్దున ప్రతి ఒక్కరూ రోజుకో ఫిర్యాదు చేస్తారని.. అప్పుడు ఎన్నికల సంఘం ప్రతిసారీ తనను అమరావతికి పిలుస్తుందా అని ఆయన అడిగాడు.

ప్రతిపక్ష నాయకుడైన జగన్‌ను లోకేష్ దూషించాడని నేను ఫిర్యాదు చేస్తే ఆయనకు కూడా ఇలాగే లేఖ పంపుతారా అని ఆయన ప్రశ్నించాడు. తాను ఎవరినీ దూషిస్తూ సినిమా తీయలేదని వివరిస్తూ ఒక లేఖ పంపాక కూడా తనను ఎన్నికల సంఘం అమరావతికి పిలవడం ఏంటని ఆయన నిలదీశారు. మొత్తానికి పోసాని పేర్కొంటున్న లాజిక్స్ అన్నీ కరెక్టుగానే ఉన్నాయి. నిజంగా ఆయన్ని అమరావతికి పిలవడం కరెక్టేనా?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English