హ్యాట్సాఫ్ మంచు మనోజ్

హ్యాట్సాఫ్ మంచు మనోజ్

మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పటిదాకా తన కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వలేదతను. ఎలాంటి ఆర్టిస్టు అయినా.. సినిమాల్లో చేయకుంటే ఆటోమేటిగ్గా జనాలు మరిచిపోతుంటారు. ఐతే మంచు మనోజ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లు అయినా తనను మరిచిపోకుండా చూసుకుంటున్నాడు.

ఇప్పుడు మనోజ్ చేసిన ఒక మంచి పనితో అతడిపై ప్రశంసలు కురిపిస్తోంది. ఇటీవల తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన అశ్విత అనే అమ్మాయి అనాథగా మారింది. ఈ అమ్మాయి గతంలో తల్లిని కోల్పోయింది. ఇటీవలే తండ్రి కూడా అనారోగ్యంలో మరణించాడు. పేద కుటుంబానికి చెందిన అశ్విత తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి దయనీయ స్థితిలో మిగిలింది. తండ్రి మృతదేహం దగ్గర కూర్చుని ఏడుస్తున్న ఆమె ఫొటో చూస్తే కన్నీళ్లు ఆగవు. కొన్ని రోజుల కిందట ఆ ఫొటో ట్విట్టర్లోకి రాగా.. దాన్ని చూసి మనోజ్ వెంటనే స్పందించాడు.

ఈ అమ్మాయి వివరాలు తెలపాలని.. తన బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించాడు. వెంటనే అశ్విత గురించి నెటిజన్లు వివరాలు అందించారు. ఆ పాప గురించి వివరాలు తెలుసుకున్న మనోజ్.. సోమవారం అశ్వితను తన దగ్గరికి పిలిపించుకున్నాడు. ఆ అమ్మాయిని తమ విద్యా నికేతన్‌లో చేర్పించి విద్య, వసతి అన్ని విషయాలూ తాము చూసుకోబోతున్నట్లు వెల్లడించాడు.

మంగళవారం మనోజ్ తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజు. ఆ సందర్భంగా అశ్వితను విద్యా నికేతన్‌లో చేరుస్తుండటం విశేషం. ఐఏఎస్ ఆఫీసర్ కావడం అశ్విత లక్ష్యమని.. అది చేరుకునేందుకు అన్ని విధాలా తాము సహకరిస్తామని మనోజ్ తెలిపాడు. ఏదో ప్రచారం కోసమని కాకుండా మనోజ్ నిజాయితీగా ఈ పాప విషయంలో స్పందించిన తీరు, ఆమె బాధ్యత తీసుకున్న వైనం అందరినీ ఆకట్టుకుంది. దీంతో అందరూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English