‘బాహుబలి’ని చూస్తే భయం లేదా?

 ‘బాహుబలి’ని చూస్తే భయం లేదా?

ఐదేళ్ల ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ రూ.30 కోట్ల దగ్గర ఉండేది. అప్పటికి ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘మిర్చి’ రూ.35 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయింది. ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘సాహో’ మీద రూ.300 కోట్ల దాకా బడ్జెట్ పెడుతున్నారు. దాని మీద ఓ వంద కోట్లు ఎక్కువకే బిజినెస్ జరిగే పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పుడు ప్రభాస్ ఏ ఒక్క భాషకో పరిమితం అయిన హీరో కాదు. దేశవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. మార్కెట్ కూడా అలాగే విస్తరించింది. ప్రభాస్‌ను చూసి బాలీవుడ్ స్టార్లు కూడా భయపడే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 15న ‘సాహో’ రిలీజ్ కావాల్సి ఉండగా.. అదే తేదీకి షెడ్యూల్ అయిన హిందీ సినిమాల్ని వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం ప్రభాస్ చిత్రానికి భయపడుతున్నట్లుగా కనిపించడం లేదు.

తన కొత్త సినిమా ‘కాప్పన్’ను ఆగస్టు 15నే రిలీజ్ చేయడానికి సూర్య సన్నాహాలు చేస్తున్నాడు. ఇంతకుముందు సూర్యతో ‘వీడొక్కడే’.. ‘బ్రదర్స్’ సినిమాలు తీసిన కె.వి.ఆనంద్ రూపొందించిన చిత్రమిది. ఇందులో మోహన్ లాల్, ఆర్య లాంటి భారీ తారాగణం ఉంది. తమిళంలో భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు సూర్య స్వయంగా ప్రకటించాడు. ఐతే ‘సాహో’ దక్షిణాదిన అన్ని భాషల్లోనూ భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

తమిళంలో కూడా పెద్ద స్థాయిలోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. ఇక తెలుగు సంగతి చెప్పాల్సిన పని లేదు. సూర్య సినిమా అంటే తెలుగు మార్కెట్ కూడా కీలకమే. అలాంటిది ‘సాహో’కు పోటీగా ‘కాప్పన్’ను రిలీజ్ చేస్తే ఇబ్బందులు తప్పవు. సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమాను తెలిసి తెలిసి ‘సాహో’కు పోటీగా రిలీజ్ చేయడమంటే సాహసమే. మరి ఏ ధైర్యంతో సూర్య ఆ డేటును ఎంచుకున్నాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English