‘సాహో’ షూట్ పూర్తయిందనగానే..

‘సాహో’ షూట్ పూర్తయిందనగానే..

సాహో.. ఈ ఏడాది ఇండియాలో విడుదల కానున్న అత్యంత పెద్ద సినిమా ఇదే. ఏకంగా రూ.250-300 కోట్ల మధ్య బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ఆకాశానికి చేరిన తనన ఇమేజ్‌కు తగ్గట్లే మరో భారీ చిత్రాన్ని లైన్లో పెట్టాడు ప్రభాస్.

‘బాహుబలి’ టైంలో ఎలా అయితే ప్రేక్షకులు ఏళ్లకు ఏళ్లు నిరీక్షించారో ‘సాహో’ విషయంలోనూ అలాగే ఎదురు చూడక తప్పట్లేదు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అన్నా కోట్లాది మంది ఆసక్తిగా చూస్తున్నారు. పోయినేడాదే విడుదల కావాల్సిన ‘సాహో’ ఈ ఏడాది ద్వితీయార్ధానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐతే ఆగస్టు 15న ‘సాహో’ రిలీజ్ అని ప్రకటించినా కూడా.. పక్కాగా ఆ సమయానికి సినిమా రిలీజవుతుందా లేదా అన్న సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి.

‘సాహో’ లాంటి భారీ చిత్రం ఆగస్టు 15కి రావాలంటే ఈపాటికి షూటింగ్ పూర్తి చేసి ఉండాలి. దీని పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టే అవకాశముండటంతో ముందు టాకీ పార్ట్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. ఐతే ఇప్పటిదాకా అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. ఐతే ‘సాహో’లో తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తయిందంటూ తమిళ నటుడు అరుణ్ విజయ్ సోమవారం అప్ డేట్ ఇవ్వగానే ప్రభాస్ అభిమానుల్లో సంతోషం వెల్లివిరిసింది. తన పాత్ర వరకు షూట్ పూర్తయిన నేపథ్యంలో అతను దర్శకుడు సుజీత్‌‌తో  కలిసి కేక్ కూడా కట్ చేశాడు.

ఈ చిత్రంలో అరుణ్ కీలక పాత్ర చేస్తున్నాడు. అతడి పాత్ర తాలూకు చిత్రీకరణ పూర్తయిందంటే మొత్తం చిత్రీకరణ కూడా ముగింపు దశకు వచ్చిందనే భావిస్తున్నారు. త్వరలోనే గుమ్మడికాయ కొట్టేయబోతున్నారన్న సంకేతాలు వచ్చేశాయనుకుంటున్నారు. ఆ కబురు కూడా వచ్చేస్తే ఆగస్టుు 15 రిలీజ్ మీద ధీమా వచ్చేస్తుంది అభిమానులకు. యువి క్రియేషన్స్ బేనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English