అతను నటిస్తే సినిమా క్రేజే వేరు

అతను నటిస్తే సినిమా క్రేజే వేరు

మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త కథానాయకుడి అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ నిర్మాణంలో ఆయన శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనుంది.

ఇంతకుముందు సునీల్ హీరోగా తెరకెక్కిన ‘2 కంట్రీస్’లో కథానాయికగా నటించిన మోనికా రాజ్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో ‘రంగస్థలం’ తరహాలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఇప్పుడు ఓ పెద్ద పేరు వినిపిస్తోంది. ఈ వార్తే నిజమైతే మాత్రం ఈ ప్రాజెక్టుకు వచ్చే క్రేజే వేరు. ఇంతకీ ఆ పేరు ఏంటి అంటారా.. విజయ్ సేతుపతి.

తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి.. అద్భుతమైన నటనతో కోట్లాది మంది హృదయాలు గెలిచిన నటుడు విజయ్ సేతుపతి. అతడిని ఈ తరం కమల్ హాసన్ అంటారు. హీరో అయినా.. విలన్ పాత్రయినా.. క్యారెక్టర్ రోల్ అయినా.. విజయ్ చేశాడంటే దాని స్థాయే మారిపోతుంది. ప్రస్తుతం అతను మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సందర్భంగానే వైష్ణవ్ సినిమాలో విలన్ పాత్ర కోసం విజయ్ దగ్గరికి ప్రపోజల్ వెళ్లిందట.

పాత్ర నచ్చడం, మెగస్టార్ మేనల్లుడి సినిమా కావడంతో అతను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఆషామాషీ పాత్ర అయితే విజయ్ చేయడానికి ఒప్పుకోడు. కాబట్టి ఆ పాత్ర ప్రత్యేకంగానే ఉండి ఉండాలి. విలన్ పాత్ర బాగుంటే హీరో పాత్రను కూడా అందుకు దీటుగా తీర్చదిద్దాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో కంటెంట్ బలంగానే ఉంటుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English