నానికి గట్టి ఫిట్టింగే..

నానికి గట్టి ఫిట్టింగే..

రాజమౌళి అన్నట్లుగా ఒక దశలో నాని వరుసగా ఎన్నో హిట్టు కొడుతున్నాడు అనేది లెక్క పెట్టుకోవడం కూడా మానేశారు జనాలు. వరుసగా డబుల్ హ్యాట్రిక్‌ను మించి విజయాలు సాధించాడు నాని. ఎట్టకేలకు గత ఏడాది ‘కృష్ణార్జున యుద్ధం’తో అతడికి బ్రేక్ పడింది. వరుస హిట్లతో నానికి దిష్టి బాగా తగిలేసిందో ఏమో.. దాని తర్వాత వచ్చిన ‘దేవదాస్’ సైతం ఫ్లాపే అయింది. ఒకే ఏడాది కొన్ని నెలల వ్యవధిలో రెండు ఫ్లాపులు తిన్న నాని రేసులో వెనుకబడిపోయాడు. దీంతో ఈ ఏడాది కచ్చితంగా విజయంతో మొదలుపెట్టాలని ఆశిస్తున్నాడు నాని. అతడి కొత్త సినిమా ‘జెర్సీ’ ప్రోమోలు చూస్తే తన కోరిక తీరేలాగే కనిపించింది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలే పెంచింది. ‘జెర్సీ’ని ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేసవిలో మంచి డేట్‌లో వస్తుండటంతో సినిమాకు బాగానే కలిసొస్తుందని ఆశిస్తున్నారు.

కానీ ఇప్పుడా చిత్రానికి ఓ పెద్ద అడ్డంకి వచ్చింది. దానికి పోటీగా ‘కాంఛన-3’ సినిమా విడుదల కాబోతోంది. రాఘవ లారెన్స్ హార్రర్ కామెడీ సిరీస్‌లో రానున్న నాలుగో చిత్రమిది. డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ దీన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. గతంలో ‘కాంఛన’.. ‘గంగ’ సినిమాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ముందు వాటిని కూడా తక్కువగానే అంచనా వేశారు. కానీ అవి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. మాస్ ప్రేక్షకుల్లో ఈ సిరీస్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ఇప్పటిదాకా ప్రచార హడావుడి ఏమీ లేకపోయినా.. సినిమా రిలీజయ్యాక కథ వేరుగా ఉంటుంది. కాబట్టి క్లాస్ సినిమాలా కనిపిస్తున్న ‘జెర్సీ’కి మాస్ ఏరియాల్లో ‘కాంఛన-3’ నుంచి గట్టి పోటీనే ఉంటుంది. కాబట్టి నాని చిత్రానికి చాలా మంచి టాక్ రావడం.. మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు కూడా అందులో ఉండటం కీలకం. లేదంటే నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేసిన ఈ చిత్రానికి ఇబ్బందులు తప్పవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English