జక్కన్న చెప్పాడు.. అయినా కొట్టుకుంటారా?

జక్కన్న చెప్పాడు.. అయినా కొట్టుకుంటారా?

ఒకప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ఏ బేషజాలూ లేకుండా ఒకరితో ఒకరు కలిసి ఇబ్బడిముబ్బడిగా మల్టీస్టారర్లు చేశారు. కానీ ఆ తర్వాతి తరం హీరోలు మాత్రం ఇంత ఫ్రీగా కలిసి సినిమాలు చేయలేకపోయారు. ఎవరికి వారన్నట్లుగా సాగిపోయారు. దీంతో కొన్ని దశాబ్దాల పాటు తెలుగులో అసలు మల్టీస్టారర్ల ఊసే లేకపోయింది.

ఇద్దరు స్టార్లను కలిపి సినిమా చేయడం అన్నది తలనొప్పి వ్యవహారం అనుకున్నారు దర్శకులు. అలా చేయాల్సి వచ్చినపుడు పాటలు, ఫైట్లు, సన్నివేశాల విషయంలో ఇద్దరు స్టార్ల మధ్య బ్యాలెన్స్ పాటించడం కష్టమని.. ఏమాత్రం తేడా వచ్చినా అభిమానులతో ఇబ్బంది వస్తుందని భావించి వెనుకంజ వేశారు. మల్టీస్టారర్ల ట్రెండ్ ఆగిపోవడానికి ఒకరకంగా ఇదే కారణం. మళ్లీ కొన్నేళ్ల కిందట మల్టీస్టారర్ ట్రెండ్ మొదలయ్యాక కూడా అభిమానులు ఈ తరహా ఆలోచనల నుంచి బయటికి రాలేదు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేష్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని, వెంకీని డౌన్ ప్లే చేశారని చర్చ జరిగింది. ఐతే ఈ సినిమా మాత్రం బాగానే ఆడింది. ఆ తర్వాత అడపాదడపా కొన్ని మల్టీస్టారర్లు వచ్చాయి కానీ.. అందులో క్లిక్ అయినవి తక్కువే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కలయికలో రాజమౌళి ఓ మెగా మల్టీస్టారర్ మొదలుపెట్టాడు.

వీళ్లిద్దరూ సూపర్ స్టార్లు, పైగా సమవుజ్జీలు. కాబట్టి దీన్ని తెలుగులో అరుదైన మెగా మల్టీస్టారర్‌గా అభివర్ణిస్తున్నారు. కాకపోతే మెగా, నందమూరి కుటుంబాల అభిమానుల మధ్య ఉన్న వైరం ఎలాంటిదో తెలిసిందే కాబట్టి.. సినిమా మొదలవగానే వాళ్ల మధ్య ఫైట్ మొదలైపోయింది.

తారక్, చరణ్ ఎంత సన్నిహితంగా ఉంటున్నప్పటికీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఒకరినొకరు కించపరుచుకుంటూనే ఉన్నారు. సినిమాలో ఎవరికెంత ప్రాధాన్యం ఉంటుందని చర్చిస్తున్నారు. చరణ్ చేస్తున్న అల్లూరి పాత్రే గొప్పని మెగా అభిమానులంటుంటే.. తారక్ పోషిస్తున్న కొమరం భీమ్‌ది గ్రేట్ క్యారెక్టర్ అని నందమూరి ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఇక సినిమాలో ఎవరికెంత ప్రయారిటీ ఇస్తారనే లెక్కల్లోకి కూడా వెళ్లిపోయారు. ఐతే మొన్నటి ప్రెస్ మీట్లో సరిగ్గా ఇదే విషయంపై జక్కన్నకు ప్రశ్న ఎదురైతే.. ఆయన తనదైన శైలిలో జవాబిచ్చాడు.

బ్యాలెన్స్ కోసం ఫైట్లు, పాటలు, సన్నివేశాల్ని హీరోలిద్దరికీ పంచుకుంటూ వెళ్తే సినిమా చెడిపోతుందని.. దాని కంటే కూడా ఏ పాత్ర ఎంత ఎంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుందనేది కీలకమని.. సినిమా చూశాక ఇద్దరి పాత్రలూ సమాన స్థాయిలో ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపిస్తాయని, నచ్చుతాయని అన్నాడు. రిలీజ్ టైంలో ఎలాగూ ఈ ఫ్యాన్ వార్స్ పెరుగుతాయన్న ఉద్దేశంతో.. సినిమా చూసేటపుడు మా హీరోకెన్ని ఫైట్లు.. మీ హీరోకు ఎన్ని పాటలు అని కొట్టుకోకుండా  జక్కన్న ముందుగానే ఈ రకంగా హెచ్చరికలు ఇచ్చేశాడన్నమాట. కాబట్టి జక్కన్న మాటను మన్నించి మెగా, నందమూరి ఫ్యాన్స్ సంయమనం పాటిస్తారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English