ఔనా.. కంగనా అలా అందా?

ఔనా.. కంగనా అలా అందా?

అవతల ఉన్నది ఎంత వారన్నది చూడకుండా నోటికి ఏదొస్తే.. మనసుకి ఏమనిపిస్తే అది అనేస్తుంది కంగనా రనౌత్. పెద్ద పెద్ద హీరోల్ని దర్శకుల్ని కూడా ఆమె ఎన్నో సందర్భాల్లో ఉతికారేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కొన్నిసార్లు శ్రుతి మించి మాట్లాడుతుంటుంది కూడా. తాజాగా ఆమె ఆమిర్ ఖాన్ మీద విమర్శలు గుప్పించింది. ఆమిర్ కోసం తాను సాయపడ్డట్లు.. తనకు ఆయన సాయం చేయలేదని అంది.

‘‘నేను ఆమిర్ సినిమాలకు ప్రచారం కల్పించడానికి అంబానీ ఇంటికి వెళ్లాను. కానీ నా సినిమా కోసం ఆయన ఎప్పుడూ రాలేదు’’ అని కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమిర్ సినిమా కోసం కంగనా అంబానీ ఇంటికెళ్లడమేంటి.. కంగనా సినిమాను ఆమిర్ ఎందుకు ప్రమోట్ చేయాలి అన్న సందేహాలు కలిగాయి.

తాజాగా ఆమిర్ ఖాన్ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా మీడియా వాళ్లను తన ఇంటికి ఆహ్వానించగా.. అక్కడ కంగనా వ్యాఖ్యల గురించి అడిగారు. దీనికతను సమాధానం ఇస్తూ.. ‘కంగన అలా అందా.. నాకు తెలీదే. అయినా ఈ విషయం గురించి ఆమె నాతో ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఎప్పుడైనా తనని కలిస్తే దీని గురించి తప్పకుండా అడిగి తెలుసుకుంటాను’ అంటూ తెలివిగా విషయాన్ని తెగ్గొట్టేశాడు.

ఇక తన పుట్టిన రోజు మీడియా వాళ్లు కలిసినపుడు కొత్త సినిమా, ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్రకటన చేయడం ఆమిర్‌కు అలవాటు. ఈసారి కూడా అదే చేశాడు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతన్నట్లే ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తాను రీమేక్ చేయబోతున్నట్లు తెలిపాడు. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుందని అన్నాడు. అలాగే తన కలల ప్రాజెక్టు  మహాభారతాన్ని తెరకెక్కించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు ఆమిర్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English