‘ఆర్ఆర్ఆర్’ వదులుకుంటే వంద కోట్లిస్తామన్నారట

‘ఆర్ఆర్ఆర్’ వదులుకుంటే వంద కోట్లిస్తామన్నారట

‘బాహుబలి’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో పెద్ద సినిమాలే నిర్మించారు కానీ.. మరీ ఈ స్థాయి సినిమాను డీల్ చేయగలరా అన్న సందేహాలు కలిగాయి.

గతంలో  రాజమౌళి ఓ సగటు దర్శకుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన కమిట్మెం‌ట్‌ను నిలబెట్టుకుంటూ.. ‘ఆర్ఆర్ఆర్’ను ఆయనకు చేస్తున్నారు. ఇది తన పూర్వ జన్మ సుకృతమని.. తన భార్యా బిడ్డలు చేసుకున్న అదృష్టమని నిన్నటి ప్రెస్ మీట్లో చాలా ఉద్వేగంగా చెప్పుకొచ్చాడు దానయ్య. ఈ సినిమాను వదులుకుంటే రూ.100 కోట్లు ఇస్తామంటూ తనకు ఆఫర్లు వచ్చినట్లు ఆయన వెల్లడించడం విశేషం.

ఎవరు ఏంటన్నది చెప్పలేదు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ను తమకు ఇచ్చేస్తే అందుకు ప్రతిఫలితంగా రూ.100 కోట్లు ఇస్తామని తనను అడిగినట్లు వెల్లడించారాయన. మరి సినిమాను వదులుకుంటే వంద కోట్లు ఇస్తామన్నారంటే.. ఈ సినిమా ద్వారా ఏ స్థాయి లాభాల్ని అంచనా వేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ముందు ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లని వార్తలొచ్చాయి.

ఐతే ప్రెస్ మీట్లో దానయ్య మాట్లాడుతూ.. రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. మరి లాభాలు ఏ స్థాయిలో ఆశిస్తున్నారని అంటే మాత్రం దానయ్య ఏమీ చెప్పలేదు. అది సినిమా రిలీజయ్యే సమయానికి తెలుస్తుందన్నాడు. ‘బాహుబలి’ లాగా  ‘ఆర్ఆర్ఆర్’ కూడా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందితే సునాయాసంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టవచ్చు. దానయ్య రూ.200 కోట్లకు తక్కువ కాకుండా లాభాన్ని అందుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English