మేనల్లుడి గ్రహణం వీడేట్లే ఉందే..

మేనల్లుడి గ్రహణం వీడేట్లే ఉందే..

మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా పడ్డాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’.. లాంటి సూపర్ హిట్లతో హ్యాట్రిక్ కొట్టిన అతడు.. ఆ తర్వాత ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘తేజ్ ఐ లవ్యూ’ కూడా తేడా కొట్టేయడంతో తేజు కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. అంతకుముందు వరకు విరామం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సినిమా చేస్తూ పోయిన తేజు.. ఈ సారి మాత్రం బ్రేక్ తీసుకున్నాడు. ఆచితూచి అడుగు వేశాడు. ‘నేను శైలజ’ లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీతో ఆకట్టుకున్న కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేశాడు. ఈ సినిమా తేజు కెరీర్ కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏ అప్ డేట్ లేదు. ఇప్పుడు టీజర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్.. ఈ రోజు లాంచ్ చేసిన టీజర్.. రెండూ కూడా మంచి స్పందనే రాబట్టుకున్నాయి. తేజు గత సినిమాల ప్రోమోలు చూస్తేనే ఏదో తేడాగా అనిపించాయి. ‘ఇంటిలిజెంట్’.. ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాలు ఆడతాయన్న ఆలోచనే వాటి ప్రోమోలు కలిగించలేదు. విపరీతమైన నెగెటివిటీ మధ్య ఆ సినిమాలు రిలీజయ్యాయి. ఐతే ‘చిత్రలహరి’ విషయంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీని టైటిల్ బాగుంది. నిన్నటిఫస్ట్ లుక్ పోస్టర్లో ఒక ఆహ్లాదం కనిపించింది. టీజర్ సైతం ప్లెజెంట్ ఫీలింగ్ కలిగించింది. ఇదొక ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లాగా కనిపించింది. ఈ పాజిటివిటీ సినిమాకు కచ్చితంగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. చూస్తుంటే ఎట్టకేలకు తేజుకు పట్టిన గ్రహణం వీడుతుందనే అనిపిస్తోంది. ఏప్రిల్ 12న ఏమవుతుందో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English