చిరంజీవి కోసం ఉపేంద్ర కథ చెప్పిన వేళ..

చిరంజీవి కోసం ఉపేంద్ర కథ చెప్పిన వేళ..

కన్నడ సినీ పరిశ్రమలో బ్యాగ్రౌండ్ ఏమీ లేకుండా వచ్చి.. పెద్ద హీరోగా ఎదిగిన వ్యక్తి ఉపేంద్ర. నటుడిగా, దర్శకుడిగా అతడి స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘ఓం’.. ‘ఉపేంద్ర’ లాంటి సినిమాలతో 90ల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడతను. అప్పట్లో ఆ సినిమాలు ఇరగాడేశాయి. ఉపేంద్ర పేరు మార్మోగేలా చేశాయి. అప్పుడు ఉపేంద్ర క్రేజ్ చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం అతడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడట.

ఉపేంద్ర తన టీంతో కలిసి ఇక్కడికి వచ్చి చిరు కోసం ఓ కథ కూడా చెప్పాడట. ఆ కథ విని తనకు మైండ్ బ్లాంక్ అయిపోయిందని అంటున్నాడు సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఉపేంద్ర హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఐ లవ్ యూ’కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు చౌదరి అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉపేంద్ర గురించి చెబుతూ.. అతను చిరు కోసం కథ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.

‘‘నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది. నేను వైజయంతి మూవీస్‌లో పని చేస్తున్నప్పుడు చిరంజీవి గారి సినిమాకు దర్శకత్వం వహించమని ఉపేంద్ర పిలిపించారు. ఒక బ్యాచ్‌తో వచ్చారు. అప్పటివరకూ చేస్తున్న కథలకు పూర్తి భిన్నంగా.. వేరే జానర్‌లో కొత్త కథ చెప్పారు. సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా.. రూల్స్‌ని బ్రేక్‌ చేస్తూ ఆ కథను తీర్చిదిద్దారు ఉపేంద్ర. ఆ కథ విని అందరూ షాకయ్యారు. కమర్షియల్‌ పంథాలోనే కొత్త కోణంలో కథ చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వర్కవుట్ కాలేదు’’ అని చౌదరి చెప్పాడు.

ఈ మధ్య ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్ఎక్స్‌ 100’ లాంటి సినిమాలు తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాయని.. ఐతే వాటికి తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్ర ఎప్పుడో తీశాడని.. ‘ఎ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ లాంటి సినిమాలు చూస్తే తనకు ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుందని చౌదరి అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English