నాగార్జున మాటే నాగబాబు మాట

నాగార్జున మాటే నాగబాబు మాట

మహానటి సావిత్రి బయోపిక్ అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో దక్షిణాదిన మరిన్ని బయోపిక్స్ దిశగా అడుగులు పడ్డాయి. ఈ ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలితల బయోపిక్స్‌కు శ్రీకారం చుట్టారు. ఇందులో ఎన్టీఆర్, వైఎస్ బయోపిక్స్ ఆల్రెడీ రిలీజయ్యాయి కూడా. ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ టైంలో ఏఎన్నార్ బయోపిక్ కూడా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.

కానీ అక్కినేని నాగార్జున అందుకు ససేమిరా అనేశాడు. కెరీర్ ఆరంభంలో మినహాయిస్తే ఏఎన్నార్ జీవితంలో ఒడుదుడుకులు పెద్దగా లేవని.. ఆయన జీవితం ఫ్లాట్‌గా సాగిపోయిందని.. డ్రామా తక్కువని.. కాబట్టి ఆయన బయోపిక్ తీస్తే అంత బాగోదని నాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించడంతో ఏఎన్నార్ బయోపిక్ గురించి చర్చ ఆగిపోయింది.

ఐతే ఆశ్చర్యకరంగా ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ గురించి కొంత చర్చ మొదలైంది. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో చర్చలు పెట్టారు. ఇదే విషయాన్ని మీడియా వాళ్లు చిరంజీవి తమ్ముడు నాగబాబు దగ్గర ప్రస్తావిస్తే మాత్రం ఆయన నాగార్జున లాగే సమాధానం ఇచ్చాడు. చిరు బయోపిక్ తీయడం సరైన ఆలోచన కాదని తేల్చేశాడు. ‘‘చిరుపై బయోపిక్‌ తీయాల్సిన అవసరం లేదు. అన్నయ్య కెరీర్‌ ఆరంభంలో తను కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అంతా సక్సెస్‌ఫుల్‌ కెరీర్ సాగించాడు. సావిత్రి, సిల్క్‌ స్మిత, సంజయ్‌దత్‌ల బయోపిక్స్ బాగా ఆడాయంటే వాళ్ల జీవితాలు వేరు. వారి జీవితాల్లో ఎన్నో ఒడుదొడుకులను చవిచూశారు. కాబట్టి వారి జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీశారు. చిరు జీవితంలో అలాంటివేమీ లేవు. కాబట్టి అన్నయ్య బయోపిక్ అవసరం లేదు. రామ్‌చరణ్‌ సైతం అలాంటి ఆలోచన చేస్తాడని అనుకోను’’ అని నాగబాబు తేల్చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English