త్రివిక్రమ్ 18 ఏళ్ల తర్వాత ఇలా..


త్రివిక్రమ్ శ్రీనివాస్ బేసిగ్గా రచయిత. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు రచయితగానే ఉన్నాడు. ‘స్వయంవరం’ మొదలుకుని.. ‘జై చిరంజీవ’ వరకు రచయితగా కొనసాగాడు. రైటర్‌గా ఉన్న టైంలోనే దర్శకుడిగా మారాడు. ‘నువ్వే నువ్వే’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్నందుకోవడం.. రెండో సినిమా ‘అతడు’తో మేటి దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. తర్వాత టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. మధ్యలో కొన్ని చిత్రాలకు రచనా సహకారం అందిస్తూనే తన శైలిలో సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు.

ఐతే త్రివిక్రమ్‌లో మంచి గేయ రచయిత కూడా ఉన్న సంగతి చాలామందికి తెలియదు. ఆయన దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్న సమయంలో రవితేజ హీరోగా తన మిత్రుడైన యోగి రూపొందించిన ‘ఒక రాజు ఒక రాణి’ చిత్రానికి సింగిల్ కార్డ్‌తో పాటు రాశాడు త్రివిక్రమ్. సినిమాలో ఉన్న ఆరు పాటలూ ఆయన రాసినవే. సినిమా ఆడలేదు కానీ.. అందులోని స్వరాల వీణ.. వెన్నెలే నీవని లాంటి పాటలు అప్పట్లో మార్మోగాయి. ఐతే త్రివిక్రమ్‌తో తర్వాత ఇంకెవ్వరూ పాటలు రాయించుకోలేదు. తన సినిమాలకు కూడా ఆయన ఆ ప్రయత్నం చేయలేదు.

ఐతే ఇప్పుడు తాను స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రం కోసం త్రివిక్రమ్ మళ్లీ లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషం. పవన్ అడిగాడో.. తనే రాయాలనుకున్నాడో కానీ.. ఇందులో ‘లాలా భీమ్లా’ అంటూ తాజాగా రిలీజ్ చేసిన పాటకు త్రివిక్రమే సాహిత్యం అందించాడు. 18 ఏళ్ల విరామం తర్వాత త్రివిక్రమ్ ఇలా లిరిసిస్ట్ అవతారం ఎత్తడం విశేషమే. ఇందులో పది పడగల పాము పైన పాదమెట్టిన సామి చూడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగునెత్తినోడు.. అంటూ తనదైన శైలిలో త్రివిక్రమ్ అందించిన సాహిత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా అప్పుడప్పుడు పాటల్లో త్రివిక్రమ్ తన కలం పదును చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.