బ్రేకప్ పెయిన్ ఆడోళ్ల కంటే మగాళ్లకే ఎక్కువట..

మాయమాటలు చెప్పి మోసగిస్తారని.. అంతులేని వేదనను మిగులుస్తారంటూ మగాళ్ల మీద పడే నిందలు అన్ని ఇన్ని కావు. ఒక అమ్మాయి.. అబ్బాయి మధ్య రిలేషన్ బ్రేకప్ అయితే దాని బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుంది? అన్న ప్రశ్న వేస్తే.. ప్రతి పది మందిలో అత్యధికులు అమ్మయిలే అన్న ఆన్సర్ ఇస్తారు. కానీ.. ఇదే మాత్రం నిజం కాదని.. అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే బ్రేకప్ బాధను అనుభవిస్తారన్న కొత్త విషయాన్ని తాజాగా చేపట్టిన అధ్యయనం స్పష్టం చేసింది.

ప్రేమ కథకు హ్యాపీ ఎండింగ్ లేకున్నా.. ఏదైనా తేడా వచ్చి ఇద్దరికి బ్రేకప్ అయితే.. ఆ వేదనను ఎక్కువగా ఫీల్ అయ్యేది.. బాధ పడేది మగాళ్లే అన్న విషయాన్ని లాన్సెస్టర్ వర్సిటీకి చెందిన అధ్యయకర్తలు చేసిన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఈ సర్వే ఏదో ఆషామాషీగా.. ఒక వంద మందినో.. వెయ్యి మందినో కాకుండా ఏకంగా 1.84 లక్షల మంది భగ్న ప్రేమికుల నుంచి అభిప్రాయాల్ని సేకరించి మరీ సిద్ధం చేశారు.

ప్రేమికుల మధ్య బ్రేకప్ అయితే బాధ ఎవరిలో ఎక్కువ ఉంటుందన్న విషయంతో పాటు.. సాధారణంగా ప్రేమికుల మధ్య తలెత్తే సమస్యలు? వారిద్దరు విడిపోవటానికి దారి తీసే కారణాలు ఏమిటి? లవ్ ఫెయిల్ కావటం వెనుకున్న విషయాలేంటి? లాంటి అంశాల మీద ఈ సర్వే నిర్వహించారు. వేలాది మందితో మాట్లాడిన అనంతరం.. ఎక్కువ మంది విడిపోవటానికి ఉన్న కారణాన్ని చూస్తే.. తమ మధ్య ఉన్న సమస్యల్ని ఒకరికొకరు సరిగా చెప్పుకోకపోవటమేనని తేల్చారు. కమ్యునికేషన్ విషయంలో చోటు చేసుకునే పొరపాటు ప్రేమికుల మధ్య దూరాన్ని పెంచటమే కాదు.. బ్రేకప్ వరకు తీసుకొస్తుందన్న విషయాన్ని తాజాగా తేల్చారు.

ఇదే విషయాన్ని సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చెబితే.. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మాత్రం.. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవటం.. లేదంటే జంటలో ఒకరికి నమ్మకం లేకున్నా.. ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదని స్పష్టమైంది. ప్రేమ ఫెయిల్ అయిన వేళలో దానికున్న కారణాల్ని పక్కన పెడితే.. ఆ ఎమోషనల్ పెయిన్ ను ఆడవాళ్ల కంటే కూడా మగాళ్లు ఎక్కువగా ఫీల్ అవుతారని తేల్చారు.

లవ్ బ్రేకప్ అయ్యాక.. దాని గురించి అదే పనిగా గుర్తుకు తెచ్చుకోవటం.. స్నేహితులకు చెప్పుకోవటం లాంటివి చేస్తుంటారని.. ఇలాంటి పనులు అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే ఎక్కువ చేస్తారని తేల్చారు. పేరుకు మగాడనే కానీ.. ఎమోషన్స్ ను భరించే విషయంలో ఆడవాళ్ల కంటే మగాడు బలహీనంగా ఉంటారన్న కొత్త విషయాన్ని తాజా అధ్యయనం స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.