‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ఇచ్చే ప్రసక్తే లేదు

‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ ఇచ్చే ప్రసక్తే లేదు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో క్లాసిక్‌గా నిలిచిపోయిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. ఈ టైటిల్‌ను మెగా అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఆ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా చేస్తే చూడాలని ఆశించారు. కానీ నేచురల్ స్టార్ నాని తన కొత్త సినిమాకు ఈ టైటిల్ పెట్టుకుని మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇది రుచించక ‘బాయ్‌కాట్ నానీస్ గ్యాంగ్ లీడర్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ అతడిని టార్గెట్ చేశారు.

ఇదిలా ఉంటే మోహనకృష్ణ అనే ఒక వ్యక్తి తనే హీరోగా, నిర్మాతగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా తీస్తున్నట్లు.. ఆ టైటిల్ తన దగ్గరే ఉన్నట్లు ప్రకటించి వార్తల్లోకి వచ్చాడు. ఫిలిం ఛాంబర్లో విచారిస్తే అది నిజమే అని తేలింది. నాని-విక్రమ్ కుమార్ కాంబినేషన్లో సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ అనౌన్స్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మోహనకృష్ణతో సంప్రదింపులు జరపగా.. అతడు తగ్గలేదని తెలుస్తోంది.

తాజాగా అతను ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ నానికి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ‘‘మా మాణిక్యం మూవీస్ బేనర్లో త్వరలోనే ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమా చేయబోతున్నాం. ఇందులో నేనే హీరోగా నటిస్తూ నిర్మించబోతున్నా. గత ఏడాది అక్టోబర్‌లో ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ రిజిస్ట్రేషన్ చేశాం. షూటింగుకి కూడా ప్లాన్ చేసుకున్నాం. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని.

‘గ్యాంగ్ లీడర్’ పేరుతో ఏ మెగా హీరో సినిమా చేసినా టైటిల్ ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. టైటిల్ కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కాల్ చేశారు. కానీ నేను టైటిల్ ఇవ్వను, అమ్మను అని చెప్పాను. వాళ్లు చాలా రకాలుగా ప్రయత్నించారు. కానీ టైటిల్ మాకే దక్కింది. నాని పుట్టిన రోజు నాడు మా టైటిల్‌తో పబ్లిసిటీ చేసుకున్నారు. నా అనుమతి తీసుకోకుండా ఎలా టైటిల్‌ను ప్రకటిస్తారు?’’ అని అతను ప్రశ్నించాడు. వ్యవహారం చూస్తుంటే నాని తన సినిమాకు వేరే టైటిల్ చూసుకోక తప్పేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English